కమండల్ నుంచి..మండల్ వైపు క‌మ‌ళ‌నాథులు

Update: 2017-07-21 06:44 GMT
ఇన్నాళ్లూ కమండల్ వ్యూహాన్ని అనుసరించిన బీజేపీ.. క్రమంగా మండల్ వ్యూహం వైపు మళ్లుతోందని విశ్లేష‌కులు అంటున్నారు.  తాజాగా రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌ నాథ్‌ కోవింద్‌ ను ఎంపిక చేసి, గెలిపించుకోవడమే ఇందుకు నిదర్శనంగా విశ్లేషకులు చెప్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికలు సమీపించగానే ఎన్డీయే అభ్యర్థిగా అనేక మంది ప్రముఖుల పేర్లు బయటికి వచ్చాయి. అందులో చాలామంది ప్రజలందరికీ సుపరిచితం కూడా. కానీ ప్రధాన మంత్రి మోడీ వారందరినీ తోసిరాజని.. ఎవరికీ పెద్దగా పరిచయం లేని రామ్‌ నాథ్ కోవింద్‌ ను అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఆయనను ఎంపిక చేయడం మొదలు గెలిపించుకోవడం వరకు మోడీ వేసిన ప్రతి అడుగు రాజకీయంగా సంచలనం సృష్టించాయి. ప్రతిపక్ష జేడీయూ సైతం కోవింద్‌ కు మద్దతు పలుకడం, పలువురు ప్రతిపక్ష ఎంపీలు, ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌ కు పాల్పడటమే ఇందుకు నిదర్శనం.

రాష్ట్రప‌తి ప‌ద‌వికి రామ్‌ నాథ్ కోవింద్ గెలుపుతో దేశంలోని అధికార వ్యవస్థలో ఒక ప్రత్యేక పరిస్థితి ఏర్పడింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా రాష్ట్రపతి - ప్రధానమంత్రి పదవుల్లో ఎస్సీ - ఓబీసీ ఆసీనులవుతున్నారు. రామ్‌ నాథ్ దళిత వర్గానికి చెందినవారు కాగా, మోడీ ఓబీసీకి చెందినవారు. ఫలితంగా కాంగ్రెస్ దశాబ్దాలుగా వల్లెవేస్తున్న బడుగు - బలహీన వర్గాలకు రాజ్యాధికారం (మండల్ పాలిటిక్స్) నినాదాన్ని మొట్టమొదటిసారిగా బీజేపీ ఆచరణలో చేసి చూపినట్టయింది. దీంతో ఆయా వర్గాల ప్రజలు బీజేపీవైపు మొగ్గు చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. కాగా,  ప్రజల్లో బీజేపీ అగ్రవర్ణ పార్టీ అనే భావన ఉన్నది. పార్టీకి ఉన్న సంప్రదాయ ఓటు బ్యాంకు - ఆరెస్సెస్‌ లో - పార్టీలో ఉన్నత పదవుల్లో ఉన్నవారిని చూసి ఈ విధంగా అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టే గతంలో బీజేపీ గద్దెనెక్కినప్పుడు ఉన్నత పదవుల్లో అగ్రవర్ణాలవారే అధికారం చేపట్టారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఆ భావన క్రమంగా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.

కాంగ్రెస్‌కు ఉన్న ఎస్సీ - ఓబీసీ ఓటుబ్యాంకు చీలి బీజేపీవైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. మరోవైపు ఆరెస్సెస్ సైతం దీర్ఘకాలిక వ్యూహంతోనే పనిచేస్తున్నదని తెలుస్తున్నది. 2014 ఎన్నికల సమయంలో మోడీని ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసి ఓబీసీని బరిలో నిలిపింది. రాష్ట్రపతి అభ్యర్థిగా కోవింద్‌ ను ఎంపిక చేయడంలోనూ కీలకంగా వ్యవహరించింది. గతంలో బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వాలు ఏర్పాటైనప్పటికీ.. అవి సంకీర్ణ ప్రభుత్వాలు కావడంతో ఒత్తిళ్లకు తలొగ్గి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చేది. ఫలితంగా ఆరెస్సెస్ - బీజేపీ తమ వ్యూహాలను పక్కాగా అమలు చేసే అవకాశం ఉండేదికాదు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో బీజేపీ - ఆరెస్సెస్ తమ దూకుడు పెంచాయి. జాతీయస్థాయిలో తమ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్‌ ను దెబ్బతీయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దీంట్లో భాగంగానే కాంగ్రెస్ ముక్త భారత్ అంటూ మోడీ నినాదం ఇచ్చారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఆ పార్టీ చరిత్రలోనే అత్యంత తక్కువ సీట్లను గెల్చుకుంది. అనంతర జరిగిన పలు రాష్ర్టాల అసెంబ్లీల ఎన్నికల్లోనూ ఆ పార్టీకి పరాజయాలే ఎదురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దూకుడుతో ఉన్న బీజేపీ... కాంగ్రెస్ నినాదమైన బడుగు - బలహీన వర్గాలకు రాజ్యాధికారంను కూడా స్వీకరించినట్లు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి.
Tags:    

Similar News