డైరెక్టుగా మోడీయే రంగంలోకి దిగారు

Update: 2016-08-20 05:36 GMT
ఇండియాలో మోడీ కంటే పెద్ద బ్రాండ్ నేమ్ ఉంటుందా..? కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రిత్వ శాఖ సుదీర్ఘ మేథోమథనం తరువాత ఇదే నిర్ణయానికి వచ్చినట్లుంది. అందుకే భారీ పర్యాటక కార్యక్రమం అయిన ఇన్ క్రెడిబుల్ ఇండియాకు కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా ఏకంగా ప్రధాని మోడీని ఎంపిక చేసింది.  ‘ఇన్‌ క్రెడిబుల్ ఇండియా’ ప్రచార కార్యక్రమాలను నిర్వహించే కేంద్ర సాంస్కృతిక - పర్యాటక మంత్రిత్వ శాఖ పలు చర్చల అనంతరం ప్రధాని మోడీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.  దీంతో ఇకపై ఇన్ క్రెడిబుల్ ఇండియా కార్యక్రమాల్లో మోడీ కనిపిస్తారన్నమాట.

‘ఇన్‌ క్రెడిబుల్ ఇండియా’ యాడ్ ఫిలిమ్స్‌ కు సంబంధించిన కాన్సెప్టులనూ  వారం రోజుల్లో సమర్పించాలని యాడ్ ఫిలిమ్స్ ప్రొడ్యూసర్లను కూడా మంత్రిత్వ శాఖ కోరింది.  కాగా ఇన్‌ క్రెడిబుల్ ఇండియాకు సరయిన బ్రాండ్ అంబాసిడర్ ప్రధాని మోడీయేనని, ఎందుకంటే ప్రపంచమంతా పర్యటించే ప్రధాని మాత్రమే భారత దేశపు గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేయగలరని కేంద్ర సాంస్కృతిక - పర్యాటక శాఖ మంత్రి మహేశ్ శర్మ అంటున్నారు.

అయితే... మోడీని బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేయడం వెనుక వేరే కారణాలు కనిపిస్తున్నాయి. ఇన్‌ క్రెడిబుల్ ఇండియాకు మొన్నటివరకు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌ గా వ్యవహరించేవారు. అయితే అసహనంపై వ్యాఖ్యలు చేసిన ఆయన ‘భారత్‌ ను విడిచి వెళ్లిపోదామని నా భార్య అంటోంది’ అని అనడంతోె ఆ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని సృష్టించాయి. దీంతో ఆయన కాంట్రాక్టును మళ్లీ పొడిగించలేదు. ఆ తరువాత బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ను అంబాసిడర్ గా తీసుకోవాలని అనుకున్నారు. కానీ... అదే సమయంలో ఆయన పేరు పనామా పేపర్లలో వచ్చింది. సో... దానికీ పుల్ స్టాప్ పడింది. ఇలా ఎవరిని అనుకుంటే వారితోనే సమస్య వస్తుండడంతో ఇంకెందుకని మోడీని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.  అంతేకాదు.. మోడీ కూడా తానే దీనికి ప్రచారకర్తగా వ్యవహరిస్తానని అన్నట్లుగానూ తెలుస్తోంది.
Tags:    

Similar News