మోడీ పుట్టినరోజు సేవాదినమట

Update: 2016-09-16 04:30 GMT
చేతిలో అధికారం ఉంటే ఇలానే ఉంటుందేమో. తిరుగులేని విధంగా దూసుకెళ్తున్న ప్రధాని మోడీ ఇమేజ్ ను మరింత పెంచేందుకు బీజేపీ అధినాయతక్వం ఉత్సాహాన్ని ప్రదర్శిస్తోంది. అయితే.. ఈ ఉత్సాహం ఎక్కడ అత్యుత్సాహంగా మారుతుందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఈసారి మోడీ పుట్టిన రోజును పెద్ద ఎత్తున చేపట్టటంతో పాటు.. ఆ రోజును మరింత ఘనంగా నిర్వహించాల్సిందిగా బీజేపీ అధినాయకత్వం భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా ప్రకటిస్తున్న కార్యక్రమాల్ని చూస్తే.. మోడీ 66వ జన్మదినోత్సవాన్ని భారీగా నిర్వహించటం ద్వారా ఆయన ఇమేజ్ ను మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

ఇందులో భాగంగా మోడీ బర్త్ డే ను ‘సేవా దినంగా’ నిర్వహించుకోవాలంటూ బీజేపీ చీఫ్ అమిత్ షా పిలుపునిస్తున్నారు. ప్రజాదరణ ఉన్న ఒక ముఖ్యనేత పుట్టినరోజును భారీగా నిర్వహించటం తప్పేం కాదు. కానీ.. అదేదో బ్రహ్మండం అన్నట్లుగా కలర్ ఇస్తూ వేడుకల్ని నిర్వహించటం మొదటికే మోసం వచ్చే అవకాశంగా చెప్పొచ్చు. ఈ వేడుకల వెను రాజకీయ కోణం ఉందని చెబుతున్నారు.

దేశ వ్యాప్తంగా మోడీ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించాలన్నది బీజేపీ ఆలోచనగా చెప్పొచ్చు. మిగిలిన రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా..మోడీ అడ్డా అయిన గుజరాత్ లో మరి కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ లో మోడీ మేనియా సృష్టించేందుకు వీలుగా బర్త్ డేను ఒక అవకాశంగా గుజరాత్ అధికారపక్షం భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా ఈసారి మోడీ పుట్టిన రోజును గుజరాత్ లో నిర్వహించుకోనున్న విషయం తెలిసిందే. పుట్టినరోజు వేడుకల్ని ప్రధాని ప్రజలతో జరుపుకోనున్న విషయాన్ని ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో మోడీ బర్త్ డేను పురస్కరించుకొని మూడు గిన్నిస్ రికార్డులు.. ఒక జాతీయరికార్డు సృష్టించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గుజరాత్ లోని నవ్ సారి జిల్లాలో నిర్వహిస్తున్న ఈ రికార్డుల పుట్టిరోజు వేడుకల్లో.. ఒకేసారి 11223 మంది దివ్యాంగులకు 17వేల వీల్ చైర్లు.. మూడు చక్రాల సైకిళ్లను ఇవ్వనున్నారు. ఒకే చిత్రం లేదంటే లోగోలో ఎక్కువ మంది వికలాంగులు వీల్ చైర్లలో ఉండే గిన్నీస్ రికార్డు ఇక్కడ నెలకొల్పనున్నారు. వినికిడి లోపం ఉన్న వెయ్యి మందికి వినికిడికి ఉపయోగపడేలా సాధనాలు పంచిపెట్టే మరో రికార్డుతో పాటు.. ఒకే ప్రదేశంలో 1500 దీపాలు వెలిగించి గిన్నిస్ రికార్డు నెలకొల్పే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.  మరీ.. రికార్డుల బర్త్ డే వేడుకలు ఘనంగా జరుగుతాయా? మోతాదు మించి విమర్శలు వెల్లువెత్తుతాయా? అన్నది చూడాలి.
Tags:    

Similar News