మోడీ స్పీడ్ మామూలుగా లేదు

Update: 2015-10-31 07:09 GMT
బిహార్ ఎన్నిక‌ల త‌ల‌నొప్పి - శివ‌సేన వంటి మిత్ర‌ప‌క్షాల సణుగుడు - సాహితివేత్త‌లు-సైంటిస్ట్‌ లు త‌మ అవార్డుల‌ను వెన‌క్కుఇవ్వ‌డం వంటి ప‌రిణామాల‌న్నీ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న స‌మ‌యంలో మ‌ల‌య‌మారుతంలాగా మోడీకి ఓ తీపిక‌బురు అందింది. వ్యాపారానుకూల దేశాల్లో భారత్‌ పరిస్థితి మెరుగుపడిందని ఇటీవలే ప్రపంచ బ్యాంకు నివేదిక ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌పంచంలో 189 దేశాల్లో వ్యాపార అనుకూల దేశాల జాబితాను విడుదల చేసిన‌  ప్రపంచ బ్యాంక్..2016 సంవత్సర నివేదిక‌లో భారత్‌ స్థానం మెరుగుపడిందని తేల్చింది. గ‌త ఏడాది 142  స్థానంలో ఉన్న భార‌త్ ప్ర‌స్తుతం 130వ స్థానికి భారత్‌ చేరుకున్నట్లు వెల్లడించింది. ప‌ది స్థానాలు మెరుగుప‌ర్చుకున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

వ్యాపార అనుకూల దేశాల జాబితాలో ప్ర‌పంచ‌బ్యాంక్ ర్యాంకింగ్‌ తో ఉబ్బితబ్బిబ్బయిన మోడీ ప్రభుత్వం అనుమతులను మరింత వేగవంతం చేస్తోంది. అనుమ‌తుల కోసం పెండింగ్‌ లో  ఉన్న ఫైళ్ల‌ను క్లియర్‌ చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా జోక్యం చేసుకోనున్నారు. నెలకొకసారి ఉన్నతాధికారులతో సమావేశయ్యే ప్ర‌క్రియ‌ను మ‌రింత వేగం చేసి ఈ అనుమతుల ప్రక్రియను ఉరకలెత్తిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ స‌మావేశాల్లో భాగంగా వ్యాపార ప్రాజెక్టులు అమలుకు నోచుకోకపోవడానికి గల కారణాలను అధికారుల దగ్గర నుంచి ప్రధాని నేరుగా సేకరించనున్నారు. ఈ ఏడాది మార్చి నుండి ఇప్పటివరకు ఆయన నెలకోసారి అధికారులతో చర్చలు జరుపుతున్న కారణంగా సుమారు 3.91 లక్షల కోట్ల ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చారు. రోడ్లు - రైల్వే - విద్యుత్‌ - ఓడరేవు ప్రాజెక్టుల్లో నిలిచిపోయి ఉన్న 150 బిలియన్‌ డాలర్ల ప్రాజెక్టులు మోడీ వలన తిరిగి ప్రారంభమైనట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Tags:    

Similar News