త్వ‌ర‌లో అమెరికా అధ్య‌క్షుడితో మోడీ భేటీ.. స‌మావేశం ఫిక్స్‌?

Update: 2021-03-06 02:46 GMT
అమెరికా నూత‌న అధ్య‌క్షుడు జోబైడెన్ తో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ త్వ‌ర‌లో స‌మావేశం కానున్నారు. అయితే.. వీరిద్ద‌రూ నేరుగా కాకుండా వ‌ర్చువ‌ల్ గా భేటీ అవుతారు. అతి త్వ‌ర‌లో ఆస్ట్రేలియా నిర్వ‌హించే క్వాడ్ స‌మావేశం వేదిక‌గా ఈ దేశాధినేత‌లిద్ద‌రూ మాట్లాడుకోనున్నారు. క్వాడ్ లో అమెరికా, జ‌పాన్‌, ఇండియా, ఆస్ట్రేలియా స‌భ్య‌దేశాలుగా ఉన్నాయి. చైనా ఆధిప‌త్యాన్ని ఎదిరించ‌డానికి ఈ క్వాడ్ గ్రూప్ ఏర్పాటైంది.

ఈ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విష‌యంలో చైనాతో అమెరికా, ఆస్ట్రేలియా ఢీ అంటే ఢీ అన్నాయి. అదే సంద‌ర్భంలో భార‌త్ తో స‌రిహ‌ద్దు గొడ‌వ‌లకు చైనా కాలు దువ్వుతున్న విష‌యం తెలిసిందే. ఇలాంటి ప‌రిస్థితుల్లో క్వాడ్ దేశాల‌న్నీ మీట్ కాబోతుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటాయోన‌ని ప్ర‌పంచం ఎదురు చూస్తోంది.

కాగా.. బైడెన్ అమెరికా ప్రెసిడెంట్ అయిన త‌ర్వాత ప్ర‌ధాని మోడీ గ‌త నెల 8వ తేదీన ఫోన్ చేసి శుభాకాంక్ష‌లు తెలిపారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే క్వాడ్ స‌మావేశం ద్వారా ఇద్ద‌రూ భేటీ కాబోతున్నారు. అయితే.. ఈ స‌మావేశానికి సంబంధించి ప్ర‌ధాని కార్యాల‌యం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి స‌మాచార‌మూ విడుద‌ల కాలేదు. కానీ.. ఈ మీటింగ్ జ‌ర‌గ‌బోతోంద‌ని క్వాడ్ మెంబ‌ర్ ఆస్ట్రేలియా ప్ర‌క‌టించ‌డంతో భేటీ లాంఛ‌న‌మే అని తెలుస్తోంది.
Tags:    

Similar News