హామీని గుర్తుకు తేం.. వాచేలా కొట్టొద్దు మోడీ!

Update: 2018-04-02 04:18 GMT
ప్ర‌ధాని మోడీ త‌రీకా తెలీక దేశ ప్ర‌జ‌లు అదే ప‌నిగా త‌ప్పులు చేస్తున్న‌ట్లుగా ఉంది. ప్ర‌ధాన‌మంత్రులంతా ఒకేలా ఉండ‌ర‌న్న‌ది నిజ‌మే అయిన‌ప్ప‌టికీ.. మోడీ మాదిరి పీఎం మాత్రం ఇప్ప‌టివ‌ర‌కూ ఎదురుకాలేద‌న్న‌ది నిజం. తియ్య తియ్య‌గా మాట్లాడుతూ.. చేత‌ల్లో చురుకుపుట్టించే ఆయ‌న తీరు చాలామందికి ఇప్ప‌టికి అర్థం కాని ఫ‌జిలే.

త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తే.. సామాన్యుడి అకౌంట్లో ల‌క్ష‌లు వ‌చ్చి ప‌డ‌తాయ‌న్న ఆశ‌లు రేకెత్తించిన వైనం ఇప్పుడు ప్ర‌స్తావించ‌ట‌మే త‌ప్ప‌గా మారిన‌ట్లుంది. అంతేనా.. ఎన్నిక‌ల వేళ ఇచ్చిన హామీల అమ‌లు ఊసెత్తితే.. అంత‌కంతా అన్న‌ట్లు ధ‌ర‌ల కొరాడాను ఝుళిపిస్తున్న వైనం ఇప్పుడిప్పుడే అంద‌రికి అర్థ‌మ‌వుతోంది. తాము ప‌వ‌ర్లోకి వ‌చ్చిన త‌ర్వాత పెట్రోల్‌.. డీజిల్ రేట్లు కారుచౌక‌గా మార్చేస్తామ‌ని.. యూపీఏ త‌ర‌హా దోపిడీకి తాము చెక్ చెబుతామంటూ చెప్పిన మాట‌ల‌న్నీ ఉత్త‌వేన‌న్న విష‌యం తేలిపోయింది.

విదేశాల‌కు త‌ర‌లి వెళ్లిన న‌ల్ల‌ధ‌నాన్ని వెన‌క్కి తీసుకురావ‌టం సంగ‌తి త‌ర్వాత‌.. బ్యాంకుల్లో దాచి పెట్టిన సామాన్యుల సంప‌ద‌ను కార్పొరేట్ల‌కు పెద్ద‌మ‌న‌సుతో అప్పుగా ఇవ్వ‌టం.. వారు తిరిగి చెల్లించ‌కుండా విదేశాల‌కు పారిపోతున్న వైనాలు దేశ ప్ర‌జ‌ల‌కు వ‌ణుకు పుట్టిస్తున్నాయి. వేలాది కోట్లు తీసుకెళ్లిన మాల్యా.. ముచ్చ‌ట‌గా మూడో పెళ్లి చేసుకుంటుంటే.. ఆయ‌న ఎగ్గొట్టిన డ‌బ్బుల భారం.. ఏదో రూపంలో దేశ ప్ర‌జ‌లే భ‌రించాల‌న్న‌ట్లు ప్ర‌భుత్వం ఆలోచిస్తున్నట్లుగా వ‌స్తున్న వార్త‌లు భ‌య‌పెట్టిస్తున్నాయి.

అంత‌ర్జాతీయంగా ముడి చ‌మురు ధ‌ర‌లు పెద్ద‌గా పెర‌గ‌కున్నా.. దేశంలో పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌లకు మాత్రం రెక్క‌లు రావ‌టం తెలిసిందే. త‌మ ప్ర‌భుత్వంలో లీట‌రు పెట్రోలు ఎంతంటే అంటూ గ్రాఫిక్స్ వేసి మ‌రీ ఊరించిన క‌మ‌ల‌నాథులు.. ఇప్పుడేమో ప‌త్తా లేకుండా పోయారు. ప‌దిహేను రోజుల‌కోసారి పెంచితే ఏం బాగుంటుంది..?  బాదుడు కార్య‌క్ర‌మాన్ని రోజూ చేస్తే ఎంత హాయి?  రోజూ కాస్త అటూ ఇటూగా పెరిగే 10 పైస‌లు లెక్క‌లోకి రాకున్నా.. నెల తిరిగేస‌రికి.. పెరిగి చ‌మురు ధ‌ర‌లు మూడు నెల‌ల‌కోసారి మంట పుట్టేలా మారుతున్నాయి.

చురుకు పుట్టేలా ధ‌ర‌ల పెరుగుద‌ల ఉన్నా. మోడీ పాల‌న‌ను క్వ‌శ్చ‌న్ చేసే నాథుడు క‌నిపించ‌ని ప‌రిస్థితి. కాస్త యాక్టివ్ గా ఉండే.. సోష‌ల్ మీడియా జీవులు స‌టైర్లు మోడీని హ‌ర్ట్ చేస్తున్న‌ట్లున్నాయి. అందుకేనేమో.. అంత‌కంత‌కూ పెంచేస్తూ.. త‌న స‌త్తా చాటేస్తున్న‌ట్లుగా ఉంది.

అడ‌గాలి.. కాదంటే బ్ర‌తిమిలాడాలు.. కుద‌రంటే ప్రాధేయ‌ప‌డ్డాలి.. మ‌రీ అవ‌స‌రం అనుకుంటే కాళ్లు పట్టుకోవాలే కానీ..  చేతిలో ఉన్న సెల్లుఫోన్ తో ఆగ్ర‌హ‌పు మేసేజ్ లు పెట్టేసి..వైర‌ల్ అయిపోతుంటే అంత పెద్ద మోడీకి కోపం రాకుండా ఉంటుందా?  అందుకే త‌న‌దైన పంథాలో రోజువారీగా పెంచేస్తూ పోతున్నారు.
పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల పెంపుపై ఉద్య‌మాలు.. ఆందోళ‌న‌లు చేసే వారికి సైతం విసుగు పుట్టేలా మోడీ తీరు మారింద‌ని చెబుతున్నారు. రోజూ వారీగా పెరిగే పెట్రోల్ ధ‌ర‌ల గురించి.. అందునా ఐదు పైస‌లు.. ప‌ది పైస‌లు పెరిగితే దాన్ని ప్ర‌స్తావించ‌టం క‌ష్టంగా మారింది. దీంతో.. ఆందోళ‌న‌ల‌కు సైతం పుల్ స్టాప్ ప‌డింది.  ఇలా రోజువారీ బాదుడు కార్య‌క్ర‌మంతో జ‌నాలు కిమ్మ‌న‌కుండా చేయ‌టంలో మోడీ స‌క్సెస్ అయ్యారు.

ఇప్పుడు ప‌రిస్థితి ఎలా మారిందంటే.. త‌గ్గించ‌క‌పోతే త‌గ్గించ‌క‌పోయావ్‌.. తొక్క‌లో హామీ.. దాన్ని ప‌ట్టించుకోకు. పెంచితే పెంచావ్ కానీ.. ఒక ప‌ద్ధ‌తితో పెంచు. అంతే కానీ.. ఇలా రోజువారీగా దెబ్బ‌లేయ‌టం ఏమిటి? అన్న హాహాకారాలు సామాన్యులు చేస్తున్నారు. తాజాగా పెరిగిన పెట్రోల్‌.. డీజిల్ ధ‌రలు నాలుగేళ్ల గ‌రిష్ఠానికి చేరుకోవ‌టం గ‌మ‌నార్హం. దేశ రాజ‌ధాని ఢిల్లీలో ప్ర‌స్తుతం పెట్రోల్ ధ‌ర రూ.73.73 కాగా.. డీజిల్ ద‌ర రూ.64.58కి చేరుకుంది. ఎక్సైజ్ ప‌న్ను త‌గ్గించాలంటూ చ‌మురుసంస్థ‌లు ప్ర‌భుత్వాన్ని కోరుతున్న వేళ‌లో పెట్రోల్ ధ‌ర‌లు భారీగా పెర‌గ‌టం గ‌మ‌నార్హం. ఆదివారం ఒక్క రోజులో పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌లు లీట‌రుకు ఏకంగా 18 పైస‌లు పెరిగింది. తాజాగా పెరిగిన ధ‌ర‌ల్ని చూస్తే.. 2014 సెప్టెంబ‌రు 14 త‌ర్వాత ఇంత‌గా పెరిగింది ఇప్పుడే కావ‌టం చూస్తే.. మోడీని నేరుగా ఒక మాట అడిగేయాల‌నిపించ‌టం ఖాయం. త‌గ్గించ‌క‌పోతే త‌గ్గించ‌క‌పోయావ్‌.. ధ‌ర మాత్రం పెంచొద్దు మోడీ అంటూ బ్ర‌తిమిలాడే ప‌రిస్థితికి ప్ర‌జ‌ల్ని తీసుకొచ్చిన ఘ‌న‌త ఆయ‌న‌కు మాత్ర‌మే ద‌క్కుతుంది.
Tags:    

Similar News