అమెరికా వెళ్లి మ‌రీ మోడీ ఇండియా ప‌రువు తీశారు

Update: 2022-02-14 09:51 GMT
కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుపై ప్ర‌ధాని మోడీపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డుతున్నారు. అవ‌కాశం దొర‌కిన‌ప్పుడ‌ల్లా మోడీపై దుమ్మెత్తి పోస్తున్నారు. విలేక‌ర్ల స‌మావేశం నిర్వ‌హించి మ‌రీ తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

మోడీని దేశం నుంచి త‌రిమి కొట్టాల‌ని జ‌నాల మ‌ద్ద‌తు ఉంటే కొత్త జాతీయ పార్టీ కూడా పెడ‌తాన‌ని కేసీఆర్ అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న మోడీపై మ‌రిన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అమెరికాకు వెళ్లి మ‌రీ మోడీ దేశం ప‌రువు తీశార‌ని కేసీఆర్ పేర్కొన్నారు.

అమెరికాలో గ‌త అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు ముందు మోడీ అక్క‌డ ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా అహ్మ‌దాబాద్‌లో న‌మ‌స్తే ట్రంప్ పేరుతోనూ భారీ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. దీంతో అన్ని ర‌కాలుగా మోడీని టార్గెట్ చేసేందుకు సిద్ధ‌మైన కేసీఆర్‌.. అందుకు ఏ అవ‌కాశాన్ని వ‌దులుకోవ‌డం లేద‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌వుతోంది. అందుకే అమెరికా ఎన్నిక‌ల విష‌యాన్ని ప్ర‌స్తావించారు.

అమెరికా ఎన్నిక‌ల‌తో మ‌న దేశానికి ఏమైనా సంబంధం ఉందా? అవేమైనా అహ్మ‌దాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌లా? అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఎవ‌రైనా బాధ్య‌త గ‌ల ప్ర‌ధాని ఇత‌ర దేశాల ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేస్తారా? అది కూడా అమెరికా లాంటి దేశంలో అని మోడీపై విరుచుకుప‌డ్డారు.

అమెరికా వెళ్లి అబ్‌కీ బార్ ట్రంప్ స‌ర్కార్ అని మోడీ ప్ర‌చారం చేశార‌ని ఇది పూర్తిగా వ్యూహాత్మ‌క త‌ప్పిద‌మ‌ని కేసీఆర్ విమ‌ర్శించారు. ఆ ఎన్నిక‌ల్లో ట్రంప్‌కు ఓట‌మే ద‌క్కింద‌ని అక్క‌డ ప్ర‌భుత్వం ప‌ల్టీ కొట్టింద‌ని తెలిపారు. దీంతో అక్క‌డ ఇండియా ప‌రువు పోయింద‌ని మోడీపై కేసీఆర్ మండిప‌డ్డారు. ఇటీవ‌ల మోడీ అమెరికా వెళ్తే వైట్‌హౌజ్‌లో ప‌ల‌క‌రించే వారే లేర‌ని ఎయిర్‌పోర్టులో గౌర‌వ‌మైన స్వాగ‌తం లేద‌ని దేశం ప‌రువు పోయింద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

ఇలాంటి ప్ర‌ధాని దేశానికి అవ‌స‌రం లేద‌ని మోడీని తరిమి కొట్టాల‌ని పిలుపునిచ్చారు. అందు కోసం జాతీయ రాజ‌కీయాల్లో క్రియాశీల‌క పాత్ర పోషిస్తాన‌ని కేసీఆర్ వెల్ల‌డించారు. అందుకు జ‌నాల మ‌ద్ద‌తు ఉంటే కొత్త జాతీయ పార్టీ కూడా స్థాపిస్తాన‌ని ప్ర‌క‌టించారు.
Tags:    

Similar News