ఆ ఎమ్మెల్యే బాబు స‌ర్కారుపై మళ్లీ ఫైర‌య్యాడు

Update: 2017-06-20 10:13 GMT
క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరుగా ప్ర‌చారంలో ఉండే తెలుగుదేశం పార్టీలో అదే క్ర‌మ‌శిక్ష‌ణ క‌రువై పోతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. త‌మ పాల‌న అద్భుత‌మ‌ని టీడీపీ అధినేత‌ - ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వ పనితీరుపై పాజిటివ్ గా ప్రచారాలు చేసుకుంటూ పోతుంటే, మరోవైపు సొంతపార్టీ నాయకులే ప్రభుత్వ పనితీరుపై పెదవి విరుస్తున్నారు. పార్టీ పరువును బజారున పెట్టేలా వ్యాఖ్యలు చేయవద్దని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఎంత చెప్పినా నేతల చెవికెక్కడం లేదు. ఇప్పటిదాకా పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న టీడీపీ ఈస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అసలే మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కొంతకాలంగా సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న మోదుగుల మరోసారి తన వ్యాఖ్యలతో కలకలం రేపారు.

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన-ఎన్టీఆర్ నగర్ కార్యక్రమ ప్రారంభోత్సవంలో సీఎం పేదలకు ఇళ్ల అవసరాన్ని వివరిస్తూ తమ ప్రభుత్వం నిధులను ఖర్చు చేస్తోన్న వైనాన్ని వివరించారు. పేదలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాబు ఇలా చెప్పిన కాసేపటికే టీడీపీ ఈస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. ఇళ్లు కట్టి చేతులు దులుపుకుంటే సరిపోదని అందులో మౌలిక వసతుల్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. నగరంలో 30 వేల ఇళ్లకోసం దరఖాస్తులు పెట్టుకుంటే కేవలం 6 వేలే మంజూరయ్యాయని వాపోయారు. సీఆర్డీఏ అధికారులు గుంటూరుపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. విజయవాడకు ఇచ్చిన ప్రాధాన్యత గుంటూరుకు ఇవ్వడం లేదని మోదుగుల అన్నారు. గుంటూరుకు ఏం చేశారో వివరించాలని డిమాండ్ చేశారు. పేదల ఇళ్లు కొనుగోలు చేసే పెద్దలను అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టే చట్టం తేవాలని ప్రభుత్వాన్ని కోరారు. కాంట్రాక్టర్లు చేసిన తప్పుల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఎమ్మెల్యే విచారం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మోదుగుల వ్యాఖ్య‌ల‌పై బాబు ఒకింత అవాక్క‌య్యారు.

మ‌రోవైపు మోదుగుల ఇటీవల పలుమార్లు షాకింగ్ కామెంట్లు చేశారు. రైతుకు రుణమాఫీ పూర్తి కాలేదని గతంలో వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లాలో రియాల్టర్లు లక్షల హెక్టార్ల ఎకరాల్లో లే ఔట్లు వేసి రైతుల ముసుగులో ఎరువుల సబ్సిడీలు పొందుతున్నారన్నారు. చంద్రన్న బీమాను కార్మికులు కాని వారే ఎక్కువగా వాడుకుంటున్నారని విమర్శించారు. ఈ నేప‌థ్యంలో తాజాగా లక్షన్నర ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో చంద్రబాబు సమక్షంలోనే ప్రభుత్వం పేదల సంక్షేమానికి చేస్తున్న కృషిని, ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించడం ఆస‌క్తిక‌రంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News