సౌదీ యువ‌రాజుపై డౌట్లు మొద‌ల‌య్యాయి

Update: 2017-06-23 09:51 GMT
గ‌ల్ప్ దేశాల్లో సౌదీ అరేబియాకు ప్ర‌త్యేక స్థానం ఉంది. సంప‌ద ప‌రంగా, నూత‌న పోక‌డ‌ల‌ను అందిపుచ్చుకోవ‌డం లోనూ సౌదీ మిగ‌తా దేశాల కంటే ప్ర‌త్యేకంగా ఉంటుంది. తాజాగా సౌదీలో జ‌రిగిన ప‌రిణామం అందరికీ తెలిసిందే. సౌదీ అరేబియా యువరాజుగా ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయ‌నకు క‌ష్టాకాలాన్ని ప‌రోక్షంగా చాటిచెప్తోంద‌ని అంటున్నారు. కొత్త యువ‌రాజు ప్రపంచ ఆయిల్ మార్కెట్‌ పై తనదైన ముద్ర వేస్తారని ఆయన అభిమానులు అంచనా వేస్తున్నారు. తద్వారా సౌదీ ఆర్థిక వ్యవస్థ ఆధునీకరణతోపాటు విస్తరిస్తారని చెప్తున్నారు. చమురు ధరలు పతనం అవుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న చమురు ఉత్పాదక (ఒపెక్) దేశాలు సైతం ప్రిన్స్ సల్మాన్‌ పై భారీ ఆశలు పెట్టుకున్నాయి. ఆయన యువకుడైనందున కొత్త ఆలోచనలు, ప్రణాళికలతో ఇంధన రంగానికి పూర్వవైభవం తెస్తారని ఆశిస్తున్నాయి.

తన తండ్రి సౌదీ అరేబియా రాజుగా గద్దెనెక్కినప్పటి నుంచి సల్మాన్ ఆ దేశ ఇంధన రంగ బాధ్యతలు చూస్తున్నారు. రెండున్నరేళ్ల‌లో ఆయన అద్భుత ప్రగతి సాధించారు. చమురు సంస్థల నిర్వహణ బాధ్యతలను చేపట్టి తనదైన ముద్ర వేశారు. వాణిజ్య పరంగానూ సౌదీ ఇంధన రంగాన్ని సల్మాన్ కొత్త పుంతలు తొక్కించారు. ఇప్పుడు యువరాజుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత దీర్ఘకాలంగా ఇంధన శాఖ మంత్రిగా కొనసాగుతున్న వ్యక్తిని తప్పించి తన ప్రణాళికలకు అనుగుణంగా పనిచేయగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తిని నియమించారు. అయితే స‌ల్మాన్ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయ‌ని అంటున్నారు. ప్రిన్స్ సల్మాన్ సుదీర్ఘ అనుభవం ఉన్న అధికారులను బలహీనపరుస్తుంటారని, ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారనే విమర్శలు కూడా ఉన్నాయి. `ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో ఊహించలేం. ఎవరి సలహాపై ఆధారపడుతారో కూడా చెప్పలేం` అని లండన్‌ కు చెందిన రాజకీయ విశ్లేషకుడు పాల్ స్టీవెన్ అన్నారు.

గతంలో చమురు ధరలు వేగంగా పడిపోవడంతో సౌదీ అరేబియాతోసహా ఇతర చమురు ఉత్పత్తి దేశాలు (ఒపెక్) ఇబ్బందులు పడ్డాయి. ఆ సమయంలో ధరలు పెరిగేందుకు ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిని తగ్గించాయి. కానీ తమకు ధరలతో సంబంధం లేదని ఉత్పత్తిని కొనసాగిస్తామని సల్మాన్ ప్రకటించారు. అదే సమయంలో అమెరికా, లిబియాలోని చమురు కంపెనీలు అపరిమితంగా చమురును ఉత్పత్తి చేయడంతో ధరలు పడిపోయాయి. ఫలితంగా సౌదీ అరేబియాకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఉత్పత్తి తగ్గించాలన్న ఒపెక్ దేశాల నిర్ణయానికి సల్మాన్ మద్దతు పలికారు. అయినా చమురు ధరల్లో ఆశించిన మేర వృద్ధి కనిపించడం లేదు. 2014లో బ్యారెల్ చమురు ధర రూ.6500 వరకు ఉండగా క్రమంగా పడిపోతూ ప్రస్తుతం రూ.3 వేలకు చేరుకుంది. సౌదీ యువరాజుగా సల్మాన్‌ను ప్రకటించిన తర్వాత కూడా చమురు ధరల పతనం కొనసాగింది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News