రజనీ పార్టీ పెడితే ఏపీ ఇంచార్జి మోహన్‌ బాబు!

Update: 2016-09-06 17:30 GMT
ఇప్పుడంటే ఆయన రాజకీయాల జోలికి వెళ్లడం లేదు గానీ.. తెలుగు సినీరంగం నుంచి రాజకీయాల్తో దగ్గరి సంబంధం ఉన్న ప్రముఖుల్లో మోహన్‌ బాబు కూడా ఒకరు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. అప్పట్లో సుశీల్‌ కుమార్‌ షిండే వంటి వారికి సన్నిహితులు. ఆ తర్వాత పలు సందర్భాల్లో త్వరలో తన రాజకీయ రంగ ప్రవేశం ఉంటుందంటూ మోహన్‌ బాబు ప్రకటించిన సందర్భాలున్నాయి. ఇప్పుడున్న పార్టీలన్నిటిలోనూ కొన్ని కొన్ని లోపాలు ఉన్నాయంటూ ఎవ్వరినీ ప్రశంసించకుండా.. తన విలక్షణతను ప్రదర్శించిన సందర్భాలూ ఉన్నాయి.

అలాంటి నేపథ్యంలో.. అటు తమిళనాడులో ఇప్పుడు రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తారా.. పార్టీ పెడతారా? అనే చర్చ ముమ్మరంగా జరుగుతున్న వేళ... రజనీ రాజకీయాల్లోకి రావడమే గనుక జరిగితే.. అది కేవలం తమిళనాడుకే పరిమితం అయ్యే వ్యవహారం కాదని అంతా అనుకుంటున్నారు. రజనీకాంత్‌.. తమిళనాడుతో సమానంగా కాకపోయినా.. ఆంధ్ర - తెలంగాణ - కర్ణాటక రాష్ట్రాలను కూడా ఎంతో కొంత ప్రభావితం చేయగలరు.

ఈ నేపథ్యంలో రజనీకాంత్‌ రాజకీయ రంగ ప్రవేశమే గనుక నిజమైతే.. ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ రాష్ట్రాల్లో ఆ పార్టీకి కీలక నాయకుడిగా మోహన్‌ బాబు రంగప్రవేశం కూడా ఉంటుందని ప్రజల్లో చర్చోపచర్చలు నడుస్తున్నాయి. రజనీకాంత్‌ తో మోహన్‌ బాబుకు ఉన్న సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. తనకు రజనీతోనే ఎక్కువ భావసారూప్యత ఉంటుందని మోహన్‌ బాబు అంటూ ఉంటారు. కాబట్టి.. రాజకీయమే గనుక కార్యరూపం దాలిస్తే.. ఇటీవలే తాము సుయోధన కర్ణులం అని మోహన్‌ బాబు చెప్పుకున్నట్లుగా ఆ రంగంలోనూ వారు కలిసే ప్రస్థానం సాగిస్తారని జనం భావిస్తున్నారు.
Tags:    

Similar News