క‌లెక్ష‌న్ కింగ్ అరెస్ట్ త‌ప్ప‌దా?... తిరుప‌తిలో హైటెన్ష‌న్‌!

Update: 2019-03-22 06:28 GMT
స‌రిగ్గా ఎన్నిక‌ల వేళ టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో హైటెన్ష‌న్ వాతావ‌ర‌ణం చోటుచేసుకుంది. చంద్ర‌బాబు సొంతూరు నారావారిప‌ల్లెకు అత్యంత స‌మీపంలోని రంగంపేట వ‌ద్ద ప్ర‌ముఖ సినీ న‌టుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు మంచు మోహ‌న్ బాబుకు చెందిన శ్రీ విద్యానికేత‌న్ విద్యా సంస్థ‌లు ఉన్న సంగ‌తి తెలిసిందే. గ‌త కొన్ని రోజులుగా అక్కడే మ‌కాం వేసిన మోహ‌న్ బాబు... నేటి ఉద‌యం ఏకంగా రోడ్డెక్కారు. చంద్ర‌బాబు స‌ర్కారు తీరుకు నిర‌స‌న‌గా మోహ‌న్ బాబు రోడ్డెక్కిన వైనం రాష్ట్రంలో పెను సంచ‌ల‌నంగా మారిపోయింది. శ్రీ విద్యానికేత‌న్ విద్యా సంస్థ‌లో విద్య‌న‌భ్య‌సిస్తున్న విద్యార్థుల‌కు సంబంధించి ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ బ‌కాయిలు రూ.17 కోట్ల దాకా ఉంది. ఎన్నిసార్లు ప్ర‌భుత్వానికి లేఖ‌లు రాసినా... పెద్ద‌గా స్పంద‌న క‌నిపించ‌డం లేద‌ట‌. ఈ నేప‌థ్యంలో క‌ళాశాల‌ను న‌డ‌ప‌డ‌మే క‌ష్టంగా మారిపోయిందంటూ గ‌త  కొంత‌కాలంగా మోహ‌న్ బాబు ఫ్యామిలీ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి స్పంద‌న రాని నేప‌థ్యంలో నేడు ధ‌ర్నాకు దిగాల్సిందేన‌ని మోహ‌న్ బాబు నిన్న‌నే నిర్ణ‌యించారు.

ధ‌ర్నాలో భాగంగా త‌న క‌ళాశాల‌కు చెందిన విద్యార్థుల‌తో క‌లిసి తిరుప‌తిలో భారీ నిర‌స‌న ర్యాలీని నిర్వ‌హించాల‌ని కూడా ఆయ‌న నిర్న‌యించారు. అయితే మోహ‌న్ బాబు నుంచి ముందుగానే ప్ర‌క‌ట‌న వెలువ‌డిన నేప‌థ్యంలో పోలీసులు అలెర్ట్ అయిపోయారు. మోహ‌న్ బాబుతో పాటు శ్రీ‌విద్యానికేత‌న్‌కు చెందిన విద్యార్థులు క‌ళాశాల ప్రాంగ‌ణం నుంచి బయ‌ట‌కు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల వైఖ‌రిపై తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం చేసిన మోహ‌న్ బాబు... తిరుప‌తి న‌గ‌రంలో నిర్వ‌హించాల‌ని త‌ల‌పెట్టిన నిర‌స‌న ర్యాలీని ప‌క్క‌న‌పెట్టేసి... క‌ళాశాల ప్రాంగ‌ణం ఎదుటే న‌డిరోడ్డుపై భైఠాయించారు. తిరుప‌తి- పీలేరు ర‌హ‌దారిపై ఏకంగా 15 కిలో మీటర్ల మేర వాహ‌నాలు నిలిచిపోయాయి. అయితే ఎన్నిక‌ల వేళ మోహ‌న్ బాబు ధ‌ర్నాకు దిగ‌డం, న‌డిరోడ్డుపై బైఠాయించ‌డంతో  చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలోని టీడీపీకి పెద్ద దెబ్బేన‌న్న వాద‌న వినిపిస్తోంది. అయితే ధ‌ర్నాకు అనుమ‌తి లేద‌ని, ద‌య‌చేసి న‌డిరోడ్డుపై నుంచి లేచి వెళ్లిపోవాల‌ని పోలీసులు మోహ‌న్ బాబుకు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

అయితే ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్య వైఖ‌రి కార‌ణంగా తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల‌ను తెలియ‌జెప్పేందుకే ధ‌ర్నాకు దిగాన‌ని, ప్ర‌భుత్వం స్పందించే దాకా రోడ్డుపై నుంచి లేచేదే లేద‌ని కూడా మోహ‌న్ బాబు వాదిస్తున్నారు. ఈ క్ర‌మంలో అక్క‌డ హైటెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. అయితే ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అవ‌స‌ర‌మైతే మోహ‌న్ బాబును అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు య‌త్నిస్తార‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. అక్క‌డి ప‌రిస్థితిని ఇటు చంద్ర‌బాబు ప్ర‌భుత్వంతో పాటుగా ఎన్నిక‌ల సంఘానికి కూడా పోలీసులు నివేదించిన‌ట్టుగా తెలుస్తోంది. మోహ‌న్ బాబు అరెస్ట్‌ కు సంబంధించి ఇప్ప‌టికే చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నుంచి పోలీసుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించిన‌ట్టుగా తెలుస్తోంది. దీంతో మ‌రికాసేప‌ట్లోనే మోహ‌న్ బాబు అరెస్ట్ అయ్యే అవ‌కాశాలున్నాయ‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదే జ‌రిగితే... చిత్తూరు జిల్లాలో ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మారే ప్ర‌మాదం లేక‌పోలేద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి.

    

Tags:    

Similar News