జెండా ఎగుర‌వేసిన‌ భాగ‌వ‌త్ పై కేసు న‌మోదైందే!

Update: 2017-08-15 10:25 GMT
దేశ‌మంతా 71వ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు మిన్నంటుతున్నాయి. దేశం న‌లుమూల‌లా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఉత్సాహంగా స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల్లో పాలుపంచుకుంటున్నారు. ఫలితంగా నేటి ఉద‌యం నుంచి దేశ‌వ్యాప్తంగా పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంద‌నే చెప్పాలి. మ‌రి కేవ‌లం జెండా ఎగుర‌వేస్తేనే కేసు పెట్టేశారు అనే వార్త రాశారేంట‌ని అడుగుతున్నారా? అక్క‌డికే వ‌స్తున్నాం. జెండా ఎగుర‌వేయ‌డ‌మంటే.. ఏ ఒక్క‌రూ అడ్డంకి చెప్ప‌రు గానీ... అధికార యంత్రాంగం వ‌ద్ద‌న్నా విన‌కుండా జెండా ఎగుర‌వేస్తే కేసు కాకుండా ఇంకేమ‌వుతుంది మ‌రి. అయినా ఈ డొంక తిరుగుడు ఇంకొద్దు గానీ... ఇక అస‌లు విష‌యంలోకి వ‌చ్చేద్దాం.

71వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కేరళ అధికారులు అభ్యంతరం చెప్పినా ఆయన మాత్రం ఖాతరు చెయ్యకుండా జాతీయ జెండాను ఎగరవేశారు. జాతీయ జెండా ఎగరవెయ్యడానికి తనకు హక్కు లేదా అంటూ మోహన్ భగవత్ కేరళ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని కర్ణక్కియమ్మన్ పాఠశాలలో జాతీయ జెండాను ఎగరవెయ్యడానికి మోహన్ భగవత్ వెళ్లారు. అయితే ప్రభుత్వ నిధులు అందుతున్న ఈ పాఠశాలలో ప్రజాప్రతినిధులు, స్కూల్ అధికారులు మాత్రమే జెండా ఎగరవెయ్యాలని పాలక్కాడ్ జిల్లా కలెక్టర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీల నాయకులు ఈ స్కూల్ లో జెండా ఎగరవెయ్యడం సరికాదని మోహన్ భగవత్ కు నోటీసులు ఇచ్చారు. అయితే జిల్లా కలెక్టర్ ఇక్కడికి వచ్చి జాతీయ జెండా ఎగరవెయ్యాలని మోహన్ భగవత్ పట్టుబట్టారు. జిల్లా కలెక్టర్ రాకపోవడంతో అధికారులు అభ్యంతరం చెప్పినా మోహన్ భగవత్ జాతీయ జెండా ఎగవరవేశారు.

స్థానిక పోలీసులు జాతీయ జెండా ఎగరవేస్తున్న సమయంలో తీసిన వీడియో ఆధారంగా మోహన్ భగవత్ - కార్యక్రమం నిర్వహకుల మీద కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. కేరళ ప్రభుత్వం చర్యలపై ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ - బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారులు వద్దు అంటున్నా కేరళలో హింస పెరిగిపోయే విధంగా మోహన్ భగవత్ ప్రవర్తించారాని వామపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే వీటీ. బలరామ్ తన ఫేస్ బుక్ లో పోస్టు చెయ్యడంతో కేరళలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Tags:    

Similar News