అయోధ్య‌ను కూల్చింది వాళ్లు కాదు - ఆరెస్సెస్‌!

Update: 2018-04-16 11:15 GMT
అయోధ్య‌లోని రామ మందిర్ ధ్వంసం చేసిన వైనంపై రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ చీఫ్ (ఆర్ ఎస్ ఎస్‌) మోహ‌న్ భ‌గ‌వ‌త్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. చూసేందుకు అయోమ‌యంగా అనిపించేలా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు లోతుగా ఉండ‌ట‌మే కాదు వ్యూహాత్మ‌కంగా ఉన్నాయ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌య్యేలా ఉన్నాయి. ప్ర‌స్తుతం వివాదాస్ప‌ద క‌ట్ట‌టంగా అభివ‌ర్ణించే అయోధ్య‌లోని క‌ట్ట‌డంపై భ‌గ‌వ‌త్ మాట‌లు కీల‌కంగా మారాయ‌ని చెప్పాలి.

ఆయ‌న మాట‌లు విన్నంత‌నే క‌న్ఫ్యూజ్ అయ్యేలా ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న త‌న మాట‌ల్ని వ్యూహాత్మ‌కంగా మాట్లాడిన‌ట్లుగా చెప్పాలి. ఇంత‌కీ మోహ‌న్ భ‌గ‌వ‌త్ చేసిన వ్యాఖ్య‌ల్ని చూస్తే.. అయోధ్య‌లోని రామ్ మందిర్ ను ధ్వంసం చేసింది భార‌త‌దేశంలో ఉన్న ముస్లింలు కాద‌న్నారు. ఈ వ్యాఖ్య‌లో ఉన్న అయోమ‌యం ఏమిటి?  ఇంత‌కీ ఆయ‌న ఏ నేప‌థ్యంలో ఈవ్యాఖ్య‌లు చేశారు? ఈ వ్యాఖ్య‌ల అనంత‌రం మోహ‌న్ భ‌గ‌వ‌త్ ఏం మాట్లాడారు? అన్న‌ది చూస్తే.. అస‌లు విష‌యం కొంత‌మేర అర్థ‌మ‌య్యే అవ‌కాశం ఉంది.

అయోధ్య లోని వివాదాస్ప‌ద క‌ట్ట‌టం కేసు కోర్టులో విచార‌ణ‌కు వ‌చ్చిన సంద‌ర్భంలోనే సంఘ్ చీఫ్ నోటి నుంచి తాజా వ్యాఖ్య‌లు వ‌చ్చాయ‌ని చెప్పాలి. ఆయ‌న మాట‌ల ప్ర‌కారం.. మొద‌ట రామ్ మందిరం ఉంద‌ని.. దాన్ని విదేశీ ముస్లింలు ధ్వంసం చేసి మ‌సీదు నిర్మించార‌ని చెప్ప‌టం ద్వారా.. ఈ పంచాయితీ విదేశీ ముస్లింల‌కు.. త‌మ‌కు మ‌ధ్య‌న ఉన్న‌దే త‌ప్పించి.. దేశంలోని ముస్లింల‌కు దీంతో సంబంధం లేద‌న్న‌ట్లుగా ఉన్నాయ‌ని చెప్పాలి.

విదేశీ ముస్లింలు చేసిన త‌ప్పును తాము స‌రిదిద్దుతున్న‌ట్లుగా ఆయ‌న వ్యాఖ్య‌లు ఉండ‌టం గ‌మ‌నార్హం. భార‌తీయుల్ని విడ‌గొట్టేందుకే విదేశీయులు దాడుల‌కు పాల్ప‌డ్డార‌న్న ఆయ‌న మాట‌లు చూస్తే.. అయోధ్య ఉదంతంలో దేశీయ ముస్లింలకు సంబంధం లేద‌న్న వాద‌న‌ను తెర మీద‌కు తీసుకొస్తున్న‌ట్లుగా క‌నిపించ‌క మాన‌దు.

విదేశీ ముస్లింల కుట్ర మాట‌ను చెప్పిన మోహ‌న్ భ‌గ‌వ‌త్‌.. రామ మందిరం నిర్మించ‌టం భార‌త‌జాతి క‌ర్త‌వ్యంగా పేర్కొన్నారు. అయోధ్య‌లో ధ్వంస‌మేన రామ‌మందిర్ ను తిరిగి అదే స్థానంలో పున‌ర్ నిర్మించే బాధ్య‌త మ‌న‌పై ఉంద‌న్న ఆయ‌న‌.. అందుకోసం ఏ పోరాటానికైనా సిద్ద‌మ‌న్న మాట‌ను చెప్పేశారు.

రామ మందిరాన్ని య‌థాస్థానంలో నిర్మించ‌ని ప‌క్షంలో భార‌త సంస్కృతి.. సంప్ర‌దాయాల మూలాలు తెగిపోయే ప్ర‌మాదం ఉంద‌న్న ఆయ‌న‌.. మందిర్ ను తిరిగి నిర్మించుకునే హ‌క్కు ఉంద‌న్నారు. రామమందిరం కేవ‌లం దేవాల‌యం మాత్ర‌మే కాద‌ని.. మ‌న ఐడెంటిటీకి గుర్తుగా చెప్పుకున్న ఆయ‌న‌.. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయి ఖాళీగా కూర్చున్న వారు మాత్ర‌మే వివిధ రాష్ట్రాల్లో కుల హింస‌ల‌కు పాల్ప‌డుతున్న‌ట్లుగా వ్యాఖ్యానించారు. రామ మందిరం విష‌యంలో దేశీయ ముస్లింల‌కు సంబంధం లేద‌న్న‌ట్లుగా చేసిన వ్యాఖ్య‌ల‌పై ఎలాంటి స్పంద‌న‌లు వెలువ‌డ‌తాయ‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News