ఏపీలోని ఆ న‌గ‌రంలో మంకీపాక్స్ కలకలం!?

Update: 2022-08-08 09:30 GMT
మంకీ పాక్స్ వ్యాధి ప్ర‌పంచ దేశాల‌ను బెంబేలెత్తిస్తోంది. ఇప్ప‌టికే 90కి పైగా దేశాల్లో మంకీ పాక్స్ కేసులు వెలుగుచూశాయి. మ‌న‌దేశంలోనూ మొత్తం ఇప్ప‌టివ‌ర‌కు 9 కేసులు న‌మోదు కాగా.. ఒక‌రు మృతి చెందారు. కాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని విశాఖ‌ప‌ట్నంలో ఓ యువ‌కుడికి మంకీ పాక్స్ లక్షణాలతో బాధపడుతున్నాడు . గీతం క‌ళాశాల ఐసోలేష‌న్ వార్డులో చికిత్స పొందుతున్న అత‌డు పరారు కావ‌డంతో అంతా ఆందోళ‌న చెందారు.

అయితే అత‌డి ఆచూకీని విశాఖ జిల్లా వైద్యాధికారులు ఎట్ట‌కేల‌కు గుర్తించార‌ని తెలుస్తోంది. పోలీసులు, గీతం క‌ళాశాల‌ సిబ్బంది సదరు యువకుడిని పట్టుకుని.. కళాశాలలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. అధికారులకు సమాచారం అందించారు. దీంతో వైద్యుల బృందం అక్కడకు చేరుకుని ఆ యువకుడి ముక్కు నుంచి నమూనాలు సేకరించి పుణెలోని ల్యాబ్‌కు పంపారు.

గీతం మెడికల్‌ కళాశాల విద్యార్థి ఒకరికి మంకీ పాక్స్‌ లక్షణాలు ఉండడంతో సహచర విద్యార్థులు కళాశాల అధికారులకు సమాచారం అందించారు. అధికారులు ఆ యువకుడిని ఐసొలేషన్‌ వార్డులో ఉంచి, జిల్లా వైద్యాధికారులకు తెలియజేశారు. అయితే వైద్యుల బృందం వచ్చేసరికి ఆ యువకుడు పరారవడంతో సర్వత్రా ఆందోళన చెందారు. ఎట్ట‌కేల‌కు ఆ యువ‌కుడిని ప‌ట్టుకోవ‌డంతో ప్ర‌మాదం త‌ప్పిన‌ట్టైంది.

అదేవిధంగా కొద్ది రోజుల క్రితం కూడా విశాఖలోనే ఓ వైద్య విద్యార్థినిలో మంకీపాక్స్ అనుమానిత లక్షణాలను వైద్యులు గుర్తించారు. గతకొన్ని రోజులుగా విద్యార్థిని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె శరీరం, వేళ్లపై దద్దుర్లు ఉన్నాయ‌ని వైద్యులు చెబుతున్నారు.

మంకీపాక్స్ వ్యాధి లక్షణాలుగా కనిపించడంతో వైద్యులు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు విశాఖ కలెక్టర్ మల్లికార్జున దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ ఆదేశాలతో మెడిసిన్, డెర్మటాలజీ, ఎస్పీఎం, మైక్రోబయాలజీ విభాగాల అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మరో ఇద్దరు టెక్నీషియన్లతో కూడిన టీమ్ క‌ళాశాల‌కు వెళ్లింది.

మంకీపాక్స్ లక్షణాలతో బాధపడుతున్న విద్యార్థిని నుంచి వైద్యుల బృందం నమూనాలు సేకరించారు. ఈ శాంపిల్స్ వైద్య పరీక్షల కోసం పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. అయితే మంకీపాక్స్ అనుమానిత కేసుగా భావిస్తున్నామని, నిర్థారణ కోసం శాంపిల్స్ సేకరించినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇటీవల విద్యార్థినిని కలిసిన వారి వివరాలను వైద్యాధికారులు ఆరా తీస్తున్నారు.
Tags:    

Similar News