సెంటిమెంటు అయిపోయింది మోపిదేవీ.. ప్ర‌జ‌ల‌కు పాల‌న కావాలి!

Update: 2021-11-26 08:30 GMT
రాజ‌కీయాల్లో సెంటిమెంటు కావ‌ల్సిందే. సెంటిమెంటు లేక‌పోతే.. ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను త‌మ‌కు అనుకూ లంగా మ‌లుచుకుని..త‌మ‌వైపు తిప్పుకోలేక పోతే.. కేంద్రంలోకానీ.. రాష్ట్రాల్లో కానీ.. పాలకులు.. రాజ‌కీయ నేత‌లు విజ‌యం ద‌క్కించుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. దీనిని ఎవ‌రూ కాద‌నరు. కానీ, ఎప్పుడూ..ఒకే ర‌క‌మైన సెంటిమెంటును ప‌ట్టుకుని వేలాడితే..ఎలా? అనేదే ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఎందుకంటే.. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అధినేత జ‌గ‌న్ సెంటిమెంటును అడ్డు పెట్టుకునే అధికారంలోకి వ‌చ్చార‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే..

రాజ‌న్న రాజ్యం తెస్తాన‌ని.. ఒక్క‌ఛాన్స్ ఇవ్వాల‌ని ఆయ‌న పాద‌యాత్ర చేప‌ట్టారు. అంతేకాదు.. వైఎస్సార్ ఫొటోతోనే ఆయ‌న ఎన్నిక‌ల‌కు వెళ్లారు. నిజానికి అప్ప‌టికి ఈ సెంటిమెంటు వ‌ర్క‌వుట్ అయింది. ఎందుకంటే.. అప్ప‌టికి జ‌గ‌న్ పాల‌న ప‌గ్గాలుచేప‌ట్టలేదు. దీంతో .. క‌నీసం ఒక్క‌సారైనా.. ఆయ‌న పాల‌న చూద్దాం.. నిజంగానే రాజ‌న్న రాజ్యం తెస్తారేమో.. అని ప్ర‌జ‌లు భావించి ఉండొచ్చు. ఈ క్ర‌మంలోనే ఆ సెంటిమెంటు వ‌ర్కవుట్ అయింది. అయితే.. పాల‌న ద‌క్కిన త‌ర్వాత‌.. రెండున్న‌రేళ్ల‌కు కూడా ఇంకా వైఎస్సార్‌ను ప‌ట్టుకుని.. ఆయ‌న సెంటిమెంటుతోనే రాజ‌కీయాలు చేయాల‌ని అనుకోవ‌డ‌మే ఇప్పుడు విమ‌ర్శ‌ల‌కు దారితీసింది.

మాజీ మంత్రి, రాజ్య‌స‌భ స‌భ్యుడు మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌.. తాజాగా కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. అది కూడా వైఎస్సార్ సెంటిమెంటును మ‌రోసారి రెచ్చ‌గొట్టేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నించారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ప్ర‌స్తుతం వ‌ర‌ద ప్రభావిత జిల్లాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేశారు. గాలిలో తిరిగిన‌వారు గాలిలోనే కొట్టుకుపోతారంటూ.. కేవ‌లం ఆయ‌న వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ఏరియ‌ల్ స‌ర్వే నిర్వ‌హించి.. స‌రిపెట్ట‌డం.. బాధితుల‌కు బాస‌ట‌గా నిల‌వ‌లేక పోవ‌డం వంటివి ప్ర‌స్తావిస్తూ.. బాబు ఈ వ్యాఖ్య‌లు చేశారు.

అయితే.. ఈ వ్యాఖ్య‌ల‌ను రాజ‌కీయంగా కంటే.. సెంటిమెంటుగా.. అది కూడా వైఎస్సార్ సెంటిమెంటుగా త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు మోపిదేవి ప్ర‌య‌త్నించారు. వైఎస్ మ‌ర‌ణం వెనుక‌.. చంద్ర‌బాబుహ‌స్తం కూడా ఉందేమో.. అని అనుమానాలు వ‌స్తున్నాయ‌ని అన్నారు. హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో వైఎస్ మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బాబు వ్యాఖ్య‌ల‌ను మ‌రోసారి వైఎస్ మ‌ర‌ణానికి ముడిపెట్టి.. సెంటిమెంటు రంగ‌రించాల‌నేది మోపిదేవి ప్లాన్ అయి ఉంటుంద‌ని అంటున్నారు. అయితే.. ఇప్పుడు జ‌గ‌న్ పాల‌న‌ను చూస్తున్న‌వారు.. ఇంకా సెంటిమెంటు ఎందుకు.. పాల‌న‌ను చూసి క‌దా ఓట్లేసేది అంటున్నారు.
Tags:    

Similar News