భక్తి ఎక్కువైంది.. అమెరికా అయ్యవార్ల రేంజ్ ఇదీ..!

Update: 2019-07-22 07:53 GMT
ఆధ్యాత్మికం ఇప్పుడు అమెరికాలోని తెలుగు వారిని కమ్ముకుంది. భగవంతుడిపై ప్రేమ వారిని కాసులను పట్టించుకోకుండా చేస్తోంది. అమెరికా వెళ్లి లక్షలు సంపాదించిన వారంతా ఇప్పుడు ఆధ్యాత్మిక ముసుగులో గుడులు - గోపురాలు కడుతున్నారు. అందులోకి తెలుగు పూజారులను రమ్మంటూ లక్షల ఆఫర్లు ఇస్తున్నారు. ఇక అమెరికాలో డాలర్ల వర్షం కురుస్తుండడంతో తెలుగు రాష్ట్రాల పూజారులు కూడా అమెరికాకు క్యూ కడుతున్నారు.  గుడుల్లో పూజలతోపాటు ప్రవాస భారతీయుల కుటుంబాల్లో హోమాలు - వ్రతాలు ఇతర శుభాకార్యాలను జరిపిస్తూ వేల డాలర్లు ఆర్జిస్తున్నారు. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల కన్నా పూజారుల ఆదాయమే ఎక్కువగా వస్తోందట.. అర్చకులు రోల్స్ రాయిస్ - బెంజీ - బీఎండబ్ల్యూ కార్లతో పూజలు వస్తుండడం చూసి తెలుగు జనాలు విస్తుపోతున్నారట..

దేశం దాటిన వారు అక్కడి సంస్కృతి - సంప్రదాయంలో కలిసిపోతారు. కానీ ఇండియా విడిచి అమెరికా వెళ్లిన వారు అక్కడి క్రిస్టియానిటీని పక్కనపెట్టి ఏకంగా హిందుత్వాన్ని పెంచి పోషించడం విస్తరించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అమెరికాలో హిందూ దేవాలయాలు వేగంగా విస్తరిస్తున్నాయి. మన దేవుళ్లకు గుడులు వెలుస్తున్నాయి. విచిత్రం ఏంటంటే క్రైస్తువులు ఎక్కువగా ఉండే ఈ చోట మన తెలుగు వారు ఎక్కువగా ఉండడం.. వాళ్లు దేవాలయాలు కడితే క్రైస్తువులైన అమెరికన్లు గుడులకు పోటెత్తడం విశేషంగా మారింది.

అమెరికాలో 70వ దశకంలో కేవలం మూడు నాలుగు హిందూ దేవాలయాలు న్యూయార్స్ - పిట్స్ బర్గ్ - మాలీబూ లివర్ మూర్ వంటి కొన్ని చోట్ల మాత్రమే ఉండేవి. ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా విస్తరించిన భారతీయులు - తెలుగువారితో చిన్న చిన్న నగరాల్లోనూ పెద్ద ఎత్తున హిందూ దేవాలయాలు వెలుస్తుండడం విశేషం. న్యూజెర్సీలోని బ్రిడ్జి వాటర్ టెంపుల్ - గురువాయుర్ ఆలయం నిత్యం భక్తులతో పోటెత్తుతోంది. గతంలో వారంతాల్లోనే భక్తులు రాగా.. ఇప్పుడు ప్రతీరోజు పోటెత్తుతున్నారు.

తిరుమల - భద్రాచలం - అన్నవరం వంటి ప్రసిద్ధ క్షేత్రాల నుంచి ఉత్సవ విగ్రహాలతో అమెరికాకు అర్చకులు వచ్చి కళ్యాణాలు జరిపిస్తున్నారు. ప్రవచనాలు - యోగా - నృత్యశిక్షణలకు కూడా దేవాలయాలు కేంద్రంగా మారుతున్నాయి. దాతల విరాళాలతో అధిక శాతం ఆలయాలు అమెరికాలో నడుస్తున్నాయి. 

అమెరికాలో తెలుగు వారి ఆధ్యాత్మికతను చూసి స్వామీజీలు - బాబాలు - పీఠాధిపతులు కూడా అమెరికా రావడం పెరిగిపోయింది. డాల్లాస్ లో హనుమాన్ దేవాలయాన్ని నిర్వహించే బాధ్యతను గణపతి సచ్చిదానందస్వామికి అప్పగించడం విశేషం. న్యూజెర్సీ కేంద్రం చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో జీయర్ ట్రస్ట్ అమెరికా వ్యాప్తంగా దేవాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

   

Tags:    

Similar News