కరోనా ఎఫెక్ట్‌.. పనస పర్‌ ఫెక్ట్

Update: 2020-03-13 18:30 GMT
కరోనా వైరస్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు లక్షమందికి సోకింది. వేలమందిని చంపేసింది. చికెన్ - మటన్ తిన్నా వైరస్ వస్తుందన్న భయంతో జనం మాంసం వైపు కూడా చూడట్లేదు. చికెన్ మేళాలు పెడుతున్న పౌల్ట్రీ యజమానులు.. చికెన్ తింటే కరోనా రాదని ప్రచారం చేస్తున్నా జనం నమ్మడం లేదు. దీంతో చికెన్ రేట్లు అమాంతం పడిపోయాయి. కేజీ 80 రూపాయల లోపే అమ్ముతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కోళ్లను మేపలేక ప్రజలకు ప్రీగా ఇస్తున్నారు. కర్ణాటకలోని బెళగావిలో ఓ రైతు దాదాపు 6 వేల కోళ్లను బతికుండగానే ఓ గోతిలో వేసి పూడ్చిపెట్టాడు. మటన్‌ రేటు కూడా దీనస్థితిలో కొట్టుమిట్టాడుతోంది.

కరోనా ఎఫెక్ట్‌తో చికెన్ - మటన్ రేట్లు పడిపోతుంటే - పనస హిస్టరీ క్రియేట్ చేస్తోంది. భారీ రేటుకు అమ్మడవుతోంది. ఇప్పుడు చికెన్ - మటన్ బిర్యానీలకు ప్రత్యామ్నాయంగా ప్రజలు పనస బిర్యానీని లాగించేస్తున్నారు. ఆన్‌ లైన్‌ ద్వారా పనస బిర్యానీ ఆర్డర్‌ చేసేవారి సంఖ్య దేశవ్యాప్తంగా పెరిగింది. పనిలో పనిగా ఇళ్లలోనూ పసన బిర్యానీ చేయడానికి కుస్తీలు పడుతున్నారు. డిమాండ్ పెరగడంతో రేటు కూడా కొండెక్కి కూర్చుంది. మామూలు పరిస్థితుల్లో కిలో పసన 50 రూపాయలు అన్నా కనికరించని జనం - ఇప్పుడు 120 రూపాయలు పెట్టి కొంటున్నారు. అంటే దాదాపు 120 శాతం మేర పనస రేటు పెరిగింది. కూరగాయల మార్కెట్లలో పసన అంత ఈజీగా దొరక్కపోవడం కూడా రేటు ఆ రేంజ్‌ లో పెరగడానికి కారణమైంది. టేస్టు కూడా మాంసానికి ఏ మాత్రం తగ్గడం లేదని తిండిప్రియులు అంటున్నారు. పనసలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయని - ఆరోగ్యానికి మంచిదని చెప్పుకొస్తున్నారు. పసనపండు తినడం వల్ల మెంటల్ స్ట్రెస్ తగ్గుతుందని - చర్మంపై ముడతలు పోతాయని - కంటి చూపు పెరుగుతుందని - జట్టు చక్కగా పెరుగుతుందని - జీర్ణశక్తి ఇనుమడిస్తుందని ఇలా పెద్ద జాబితాను ప్రకటిస్తున్నారు.


Tags:    

Similar News