ఘోర విమాన ప్ర‌మాదం..100 మంది మృతి!

Update: 2018-05-19 06:57 GMT
క్యూబాలో ఘోర విమాన ప్రమాదం జ‌రిగింది. హ‌వానా నుంచి హోల్గున్ వెళుతోన్న బోయింగ్ 737 (డొమెస్టిక్)విమానం....బోయ్‌ రోస్‌ - శాంటియాగో డీ లావెగాస్‌ గ్రామాల మధ్య పొలాల్లో హ‌ఠాత్తుగా కుప్పకూలింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో దాదాపు 100 మందికి పైగా మరణించిన‌ట్లు తెలుస్తోంది. ఆ ప్ర‌మాదం నుంచి ముగ్గురు బ‌య‌ట‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతోన్న వారి పరిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది - స‌హాయక సిబ్బంది స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగిస్తున్నారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌ర తెలియగానే క్యూబా అధ్యక్షుడు మిగ్యుఎల్‌ డియాజ్‌ కానెల్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి అధికారికంగా మృతుల సంఖ్య వెల్ల‌డించాల్సి ఉంది. ఈ ప్ర‌మాదానికి గల కార‌ణాలు తెలియాల్సి ఉంది.

బోయింగ్‌ 737-200 విమానాన్ని....మెక్సిక‌న్ చార్ట‌ర్డ్ ఎయిర్ లైన్ గ్లోబ‌ల్ నుంచి క్యూబనా ఎయిర్ లైన్స్ లీజుకు తీసుకుంది. ఈ బోయింగ్‌ 737 విమానంలో 104 మంది ప్రయాణికులు - తొమ్మిది మంది సిబ్బంది ఉన్నారు. హవానాలోని జోస్‌ మార్టి విమానాశ్రయం నుంచి శుక్రవారం ఉదయం 11 గంటలకు ఈ విమానం బ‌య‌లుదేరింది. బ‌య‌లు దేరిన 10 నిమిషాల‌కే.....హ‌వానాకు ద‌క్షిణంగా 20 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న బోయ్‌ రోస్‌ - శాంటియాగో డీ లావెగాస్‌ గ్రామాల మధ్య పొలాల్లో ఒక్క‌సారిగా విమానం కుప్ప‌కూలిపోయింది. ప్ర‌మాదం గురించిన స‌మాచారం అందిన వెంట‌నే అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్సులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. విమానం నుంచి తీవ్ర గాయాలపాలైన నలుగురు వ్యక్తులను సహాయక సిబ్బంది బయటకు తీశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతిచెంద‌గా, మ‌రో ముగ్గురి పరిస్థితి విష‌మంగా ఉంది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గురైన విమానం 38ఏళ్ల క్రితం తయారైందని అధికారులు తెలిపారు.
Tags:    

Similar News