నో స్పెష‌ల్ స్టేట‌స్‌..నిధులు ప‌డేస్తార‌ట‌

Update: 2015-08-11 14:01 GMT
ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యపై కొద్ది రోజులుగా ముసుగులో గుద్దులాట చందంగా వ్య‌వ‌హారం న‌డుస్తోంది. కేంద్రం దీనిపై ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోయినా ఇక్క‌డ నాయ‌కులు, కేంద్ర మంత్రులు, బీజేపీ వాళ్లు క‌లిసి అదిగో పులి..ఇదిగో తోక అన్న చందంగా ఏపీ ప్ర‌జ‌ల‌ను ఊరిస్తూ..మాయ‌మాట‌ల‌తో మ‌భ్య‌పెడుతూ వ‌చ్చారు. అయితే తాజాగా మంగ‌ళ‌వారం ఈ విష‌యంపై టీడీపీ ఎంపీలు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, హోం మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ ల‌ను క‌లిసి ప్ర‌త్యేక హోదా విష‌యంపై చ‌ర్చించారు.

  ఈ మీటింగ్‌లో ఏపీకి స్పెష‌ల్ స్టేట‌స్ రాద‌నే విష‌యంపై చాలా వ‌ర‌కు క్లారిటీ వ‌చ్చిన‌ట్టు అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డి మాట‌ల్లో తేలిపోయింది. ప్ర‌త్యేక హోదా విష‌యాన్ని చ‌ట్టంలో చేర్చ‌క‌వ‌డంతో చాలా ఇబ్బందులు వ‌స్తున్నాయ‌ని...ఈ విష‌యంలో చాలా సాంకేతిక‌, చ‌ట్టప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఉన్న‌ట్టు కేంద్రం సాకుగా చూపుతోంద‌ని ఆయ‌న చెప్పారు.

     ఏపీకి స్పెష‌ల్ స్టేట‌స్ కంటే మ‌రిన్ని నిధులు ఇచ్చే విష‌యంలో మాత్ర‌మే కాస్త సుముఖంగా ఉన్న‌ట్టు ఆయ‌న ఉన్న‌ది ఉన్న‌ట్టు కుండ బ‌ద్ద‌లు కొట్టేశారు. ఇక టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి సుజ‌నాచౌద‌రి మాట్లాడుతూ స్పెష‌ల్ స్టేట‌స్ వేర‌ని, ప్యాకేజీ వేర‌ని అన్నారు. ఏపీలో ప‌రిశ్ర‌మ‌ల రాయితీలు పెంచేందుకు కేంద్ర మంత్రులు సుముఖంగా ఉన్నార‌ని ఆయ‌న చెప్పారు. సుజ‌నా ఇలాంటి డొంక తిరుగుడు మాట‌ల కంటే మేం ఏం చేయ‌లేము అని చెప్పి ఉంటే ఇంకా బాగుండేదేమో.

  ప‌ది రోజుల్లో ఏపీకి ప్ర‌త్యేక నిధులు వ‌స్తాయ‌ని సుజన చెప్పారు. ప్ర‌త్యేక హోదా రాద‌న్న విష‌యాన్ని బీజేపీ ఎంపీ కంభంపాటి హ‌రిబాబు కూడా సూటిగా చెప్పేశారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా క‌న్నా అద‌న‌పు నిధులు మాత్ర‌మే వ‌స్తాయ‌న్నారు. ఓవ‌రాల్‌గా కేంద్ర ప్ర‌భుత్వం స్పెష‌ల్ స్టేట‌స్ రాద‌ని తేల్చేసింది. కానీ ఇంకా సుజ‌నాచౌద‌రి లాంటి వారు మాత్రం మ‌బ్బుల్లో చంద్రుడిని చూపించి మాయ‌చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇక మ‌న‌కేదో ప్ర‌త్యేక నిధులంటూ మభ్య‌పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.
Tags:    

Similar News