అవ‌స్థ‌లు ప‌డ్డా వెన‌క్కి త‌గ్గ‌ని మోత్కుప‌ల్లి

Update: 2018-07-12 04:59 GMT
ఒక‌ప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబుకు స‌న్నిహితుడిగా.. టీడీపీలో సీనియ‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన మోత్కుప‌ల్లి న‌ర్సింహులు ఇప్పుడు అందుకు పూర్తి రివ‌ర్స్ లో వ్య‌వ‌హ‌రిస్తున్న వైనం తెలిసిందే. చంద్ర‌బాబు పేరు వినిపిస్తేనే మండిప‌డుతున్న ఆయ‌న‌.. బాబు అస‌లు గుట్టు విప్పి త‌న మాట‌ల‌తో సంచ‌ల‌నం సృష్టిస్తున్నాడు.

గ‌తంలో మ‌రెవ‌రూ తిట్ట‌నంత దారుణంగా బాబుపై విరుచుకుప‌డుతున్నారు మోత్కుప‌ల్లి. త‌న రాజ‌కీయ జీవితాన్ని బాబు పూర్తిగా నాశ‌నం చేశార‌న్న ఆయ‌న‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాబు ఓట‌మిని కోరుతూ తిరుమ‌ల కొండ‌కు న‌డ‌క దారిలో చేరుకుంటాన‌ని చెప్ప‌టం తెలిసిందే.

త‌న‌కు ఆరోగ్య ఇబ్బందులు ఉన్న‌ప్ప‌టికీ బాబు ఓట‌మి కోరుతూ తిరుమ‌ల కొండ‌ను ఎక్కనున్న‌ట్లు చెప్పిన మోత్కుప‌ల్లి.. అందుకు త‌గ్గ‌ట్లే  తిరుమ‌ల కొండ‌కు చేరుకున్నారు. హైద‌రాబాద్ నుంచి రేణిగుంట‌కు విమానంలో వెళ్లిన ఆయ‌న‌.. తిరుమ‌ల‌కు న‌డ‌క మొద‌లెట్టారు. న‌డ‌క‌కు ముందు చంద్ర‌బాబుపై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తిన ఆయ‌న‌తో ప‌లువురు నాయ‌కులు న‌డిచారు.

కుల రాజ‌కీయాలుచేసే చంద్ర‌బాబు కార‌ణంగా టీడీపీలో ద‌ళితులంతా ద‌గా ప‌డ్డార‌న్నారు. పార్టీలో క‌ష్ట‌ప‌డ్డ ఏ ద‌ళితుడికి న్యాయం జ‌ర‌గ‌లేద‌న్నారు. కేంద్ర మంత్రి ప‌ద‌వులు.. రాజ్య‌స‌భ స‌భ్యులుగా ద‌ళితులు ప‌నికిరారా? అని ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. సుజ‌నా.. సీఎం ర‌మేశ్‌.. టీజీ వెంక‌టేశ్ ల‌కు ఏ అర్హ‌త ఉంద‌ని ఎంపీ సీట్లు ఇచ్చార‌ని ప్ర‌శ్నించారు.

బాబును ఓడించేందుకు అన్ని రాజ‌కీయ పార్టీలు ఏకం కావాల‌న్న మోత్కుప‌ల్లి.. త‌న తిరుమ‌ల న‌డ‌క ప్ర‌యాణంలో అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. గాలి గోపురం వ‌ద్ద‌కు చేరుకోగానే ఆయ‌న‌కు బీపీ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. దీంతో.. అక్క‌డి టీటీడీ ఆసుప‌త్రిలో చేరారు. కారులో కొండ‌కు వెళ్లాల‌ని వైద్యులు సూచించినా.. ఆయ‌న మాత్రం త‌న ప‌ట్టుద‌ల వీడ‌లేదు.

కాలి మార్గంలోనే తిరుమ‌ల కొండ‌కు చేరుకున్నారు. న‌డ‌క కార‌ణంగా అస్వ‌స్థ‌త‌కు గురైన ఆయ‌న తిరుమ‌ల‌కు చేరుకున్న త‌ర్వాత అశ్విని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అనంత‌రం మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అస్వ‌స్థ‌త‌లోనూ బాబు ఓట‌మి కోసం న‌డుస్తాన‌న్న మోత్కుప‌ల్లి అన్నంత ప‌ని చేయ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News