హిందీ చుట్టూ.. రాజ‌కీయం.. హీరో సుదీప్‌.. వ‌ర్సెస్ బాలీవుడ్‌.. క‌న్న‌డ సీఎం ఎంట్రీ!!

Update: 2022-04-28 16:30 GMT
కన్నడ స్టార్‌ నటుడు కిచ్చా సుదీప్‌, బాలీవుడ్‌ నటుడు అజయ్‌దేవ్‌గణ్‌ మధ్య జరిగిన ట్విట్టర్‌ 'యుద్ధం'.. చిలికిచిలికి గాలివానగా మారుతోంది. జాతీయ భాష హీందీపై ఈ నటుల మధ్య జరిగిన ట్వీట్ల వార్‌ మధ్యలోకి ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రవేశించారు. సుదీప్‌ వ్యాఖ్యలను సమర్థించిన కర్ణాటక సీఎం బ‌స‌వరాజ బొమ్మై వాటిని అందరూ గౌరవించాలన్నారు.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, కుమారస్వామి.. అజయ్‌ దేవ్‌గణ్‌ వ్యాఖ్యలపై భగ్గుమన్నారు. దక్షిణాది చిత్రాలు మంచి వసూళ్లతో దూసుకెళ్తున్న కారణంగా ఉత్తరాది స్టార్స్ అసూయతో రగిలిపోతు న్నారని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఎద్దేవా చేశారు.

అస‌లేంటీ వివాదం..?

ఇకపై హిందీ మన జాతీయ భాష కాదంటూ ఓ సినిమా ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌లో కన్నడ స్టార్‌ సుదీప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే.. ఆయ‌న వ్యాఖ్య‌ల‌కు బాలీవుడ్ నుంచి వ్య‌తిరేక‌త‌రాగా.. శాండిల్ వుడ్ స‌హా.. క‌ర్నాట‌క సీఎం బొమ్మై.. ప్ర‌జాప్ర‌తినిధులు.. పార్టీల‌కు అతీతంగా మ‌ద్ద‌తిచ్చారు. "హిందీ వారే ఇప్పుడు పాన్‌ ఇండియా స్థాయి చిత్రాలు రూపొందిస్తున్నారు. తమ సినిమాలను దక్షిణాది భాషల్లో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. అయినా విజయం అందుకోలేకపోతున్నారు. ఇకపై హిందీ మన జాతీయ భాష కాదు" అని ఓ ఆడియో ఫంక్షన్‌లో సుదీప్‌ వ్యాఖ్యానించారు.

అజ‌య్ దేవ‌గ‌ణ్‌... పేలుడు!

ఈ వ్యాఖ్యలపై స్పందించిన బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌ దేవ్‌గన్‌.. హిందీ జాతీయ భాష కానప్పుడు మీ చిత్రాల ను హిందీలో ఎందుకు డబ్‌ చేస్తున్నారని ట్వీట్‌లో ప్రశ్నించారు. జాతీయ భాషగా ఎప్పటి నుంచో హిందీ ఉందని ఎప్పటికీ అదే ఉంటుందని ట్వీట్‌ చేశారు. దీనిపై మళ్లీ ట్విటర్‌ వేదికగా స్పందించిన సుదీప్‌ తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని మీరు హిందీలో చేసిన ట్వీట్‌ను తాను చదవగలిగానని, కానీ తాను కన్నడలో ట్వీట్‌ చేస్తే మీ పరిస్థితి ఏంటని అజయ్‌ దేవ్‌గణ్ను ప్రశ్నించారు.  

పొలిటిక‌ల్ ఎంట్రీ!

ఈ ఇద్దరి నటుల ట్వీట్ల వార్‌లోకి రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు వచ్చారు. సుదీప్‌ వ్యాఖ్యలను సమర్థించిన కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై.. భాషా ప్రాతిపదికనే కర్ణాటక రాష్ట్రం ఏర్పడిన విషయాన్ని గుర్తు చేశారు. సుదీప్‌ వ్యాఖ్యలు సమంజసమే అన్న బొమ్మై, ఆ వ్యాఖ్యలను గౌరవించాల న్నారు. అజయ్‌ దేవగన్‌ వ్యాఖ్యలను కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా విమర్శించారు.

మాట‌లు మంట‌లు!

హిందీ ఎప్పటికీ జాతీయ భాష కాదన్న సిద్ధరామయ్య, దేశంలో భాషా వైవిధ్యాన్ని గౌరవించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని ట్వీట్‌ చేశారు. సుదీప్‌ వ్యాఖ్యలకు మద్దతుగా ట్వీట్‌ చేసిన మాజీ సీఎం కుమారస్వామి.. భారతీయ జనతా పార్టీ హిందీ జాతీయవాదానికి అజయ్ దేవగణ్ మౌత్ పీస్ అని తీవ్రంగా విమర్శించారు. సుదీప్‌-అజయ్‌దేవగణ్ ట్వీట్ల యుద్ధంపై ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ తనదైన శైలిలో స్పందించారు. దక్షిణాది చిత్రాలు మంచి వసూళ్లతో దూసుకెళ్తుండడం వల్లే ఉత్తరాది స్టార్స్ అసూయతో రగిలిపోతున్నారని ట్వీట్ చేశారు.

దేశం మొత్తం ఒక్కటే అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, భాష ప్రజలను ఐక్యం చేసేందుకు దోహదప డాలని కానీ విడదీయడానికి కాదన్నారు. కేజీఎఫ్-2 చిత్రం కలెక్షన్స్‌లో రికార్డ్స్‌ క్రియేట్‌ చేస్తుండడం వల్ల ఉత్తరాది తారలు దక్షిణాది స్టార్స్‌పై అసూయతో ఉన్నారనేది కాదనలేని సత్యమని ట్వీట్‌ చేశారు. ఇకపై బాలీవుడ్‌ చిత్రాల ఓపెనింగ్‌ కలెక్షన్స్‌ ఎలా ఉంటాయో చూద్దామని.. త్వరలో విడుదల కానున్న రన్‌ వే 34 ఓపెనింగ్‌ కలెక్షన్స్‌తో ఇది తేలిపోతుందని అన్నారు.

ఈ వ్యాఖలపై స్పందించిన ప్రముఖ నటుడు సోనూసూద్‌.. దేశంలో ఒక భాష ఉందని, అది వినోదమని.. దానికి ఏ పరిశ్రమకు చెందినవారు అన్నది పట్టింపు లేదని అభిప్రాయపడ్డారు.
Tags:    

Similar News