చంద్రబాబు దాష్టీకంపై హస్తినకు పంచాయతీ!

Update: 2018-01-06 04:12 GMT
చంద్రబాబునాయుడు మరియు ఆయన తరఫున దాడి చేయడానికైనా ఎగబడుతున్న వ్యక్తులు - ఆయన కనుసన్నల్లో నడుచుకునే బ్యూరోక్రాట్లు అందరూ కలిసి సాగించిన దాష్టీకం గురించిన ఎపిసోడ్ ఇప్పట్లో ముగిసిపోయేలా కనిపించడం లేదు. రెండు రోజుల కిందట కడపజిల్లా పులివెందులలో జరిగిన జన్మభూమి సభలో స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా నీటి ప్రాజెక్టులకు గతంలో వైఎస్సార్ హయాంలో ఎంత మేలు జరిగిందో చెప్పే ప్రయత్నం చేస్తుండగానే తెలుగుదేశం వారంతా ఒక్కుమ్మడిగా చెలరేగిపోయిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒకవైపు తెలుగుదేశం రౌడీలంటూ వైసీపీ ఆరోపిస్తున్న వ్యక్తులు అవినాష్ రెడ్డి చేతిలో మైకు లాక్కునే ప్రయత్నం చేయడం - కలెక్టరు కూడా మైకు లాక్కోవడం - చంద్రబాబు అతని మైక్ కనెక్షన్ కట్ చేయించి.. దబాయించి.. ప్రసంగం పూర్తి చేయనివ్వకుండా కిందికి దిగిపోయేలా చేయడం - ఆగ్రహించడం జరిగింది. ఆరోజున అధికార పార్టీ దాష్టీకానికి ప్రసంగం పూర్తి చేయకుండానే.. ఎంపీ వెళ్లిపోయారు గానీ.. ఇప్పుడు ఆ ఎపిసోడ్ ను కేంద్రానికి ఫిర్యాదు చేశారు. స్థానిక ఎంపీ అయిన తన విషయంలో ప్రోటోకాల్ పాటించకుండా అవమానించారంటూ ఆయన లోక్ సభ స్పీకరు సుమిత్రా మహాజన్ కు చంద్రబాబు తదితరుల మీద ఫిర్యాదు చేశారు.

జన్మభూమి సభలో చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రజలకు ఏ మూలన వీసమెత్తు మంచి జరిగినా సరే.. అది నా మూలానే జరిగిందంటూ డప్పు కొట్టుకుంటూ ఉంటారు. జన్మభూమి కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ఘనతను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పదేపదే పిలుపు ఇస్తూ ఉంటారు. ఆయన ఎంత సొంత డబ్బా కొట్టుకున్నప్పటికీ తప్పు లేదుగానీ.. కడప జిల్లాకు ఇవాళ నీళ్లు అందుతున్నాయంటే అందుకు .. గతంలో వైఎస్సార్ హయాంలో జరిగిన పనులు కూడా కారణం అని చెప్పడం ఒక్కటీ ఆయన దృష్టిలో తప్పు అయిపోయింది.

‘‘ఇది నా సభ.. నా సభకు నువ్వు వచ్చి.. దీనిని రాజకీయం చేస్తానంటే కుదరదు’’ అంటూ ఆయన అవినాష్ రెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకల్ ఎంపీ అనే ప్రోటోకాల్ మర్యాద కూడా పాటించలేదు. ఆయన చేతినుంచి కలెక్టరు సహా ప్రెవేటు వ్యక్తులు మైకు లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ తీరు మీదనే అవినాష్ రెడ్డి లోక్ సభ స్పీకరుకు ఫిర్యాదుచేశారు. బాద్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. స్పీకరు గనుక దీనిని సీరియస్ గా తీసుకుంటే.. బాబు దాష్టీకం పై హస్తినలోనే పంచాయతీ తప్పకపోవచ్చునని పలువురు అనుకుంటున్నారు.
Tags:    

Similar News