ప్రజల మద్దతు మాన్ కేనా ?

Update: 2022-01-19 04:21 GMT
పంజాబ్ ముఖ్యమంత్రిగా ఎవరుండాలనే విషయంలో ప్రజలు ఆప్ ఎంపి భగవంత్ మాన్ కే జై కొట్టారు. తమ పార్టీ తరపున ముఖ్యమంత్రిగా ఎవరుండాలో చెప్పాలంటు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) టెలీ ఓటింగ్ నిర్వహించింది. జనవరి 13-17 మధ్య జరిగిన ఓటింగ్ లో 21.59 లక్షల మంది పాల్గొన్నారు. వీరిలో అత్యధికులు అంటే 93.6 శాతం మంది భగవంత్ మాన్ కే జిందాబాద్ చెప్పారు. ప్రస్తుతం ఆప్ తరపున రెండోసారి మాన్ ఎంపీగా ఉన్నారు. ఎంపీగానే కాకుండా పంజాబ్ ఆప్ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు.

ఆప్ ఎంపీగా ఉన్న మాన్ పార్లమెంటులో కూడా మంచి వాగ్దాటిని వినిపించారు. అలాగే పంజాబ్ అధ్యక్షునిగా పార్టీ తరపున గట్టి పోరాటాలే చేస్తున్నారు. ప్రస్తుత అసెంబ్లీలో ఆప్ పార్టీయే 20 మంది ఎంఎల్ఏలతో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ప్రజా వ్యతిరేక విధానాలపై మాన్ ఆధ్వర్యంలో పార్టీ ఎంఎల్ఏలు, నేతలు పెద్ద పోరాటాలు చేయటంతో జనాలు ఆప్ వైపు ఇపుడు మొగ్గు చూపిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఆప్ సింగిల్ లార్జెస్టు పార్టీగా అధికారంలోకి రావటం ఖాయమంటు ప్రీపోల్ సర్వేలు చెప్పాయి.

ప్రస్తుతం సంగ్రూర్ ఎంపీగా ఉన్న మాన్ రాబోయే ఎన్నికల్లో హల్కాధూరి అసెంబ్లీ నుండి పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రజలు అభిప్రాయపడ్డారు కాబట్టి మాన్ విజయం ఖాయమనే అనుకుంటున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించిన ఏకైక పార్టీగా ఆప్ రికార్డుకెక్కింది. కాంగ్రెస్ పార్టీకి అంతర్గత కుమ్ములాటలతోనే సరిపోతోంది. ముఖ్యమంత్రిని చరణ్ జీత్ సింగ్ చన్నీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని అధిష్టానానికి ఉంది. అయితే పీసీసీ అధ్యక్షుడు నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ దెబ్బకు భయపడి ఆ పనిచేయలేకపోతోంది.

ఇక బీజేపీ, శిరోమణి అకాలీ దళ్ లాంటి పార్టీలు కూడా ఇంకా సీఎం అభ్యర్ధిని ప్రకటించలేదు. బహుశా ముందుగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తే ఇబ్బందులొస్తాయని వెనకాడుతున్నట్లున్నాయి. ఏదేమైనా అధికారాన్ని అందుకునే విషయంలో కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రజాభిప్రాయం ద్వారా సేకరించే విషయంలో కూడా ఆప్ మిగిలిన పార్టీల కంటే ముందే ఉంది. దేశం మొత్తం మీద ప్రజాభిప్రాయం ద్వారా సీఎం అభ్యర్థిని ప్రకటించిన పార్టీ ఆప్ మాత్రమేనేమో.
Tags:    

Similar News