జగన్, కేసీఆర్ లకు కాంగ్రెస్ గాలం.. దూతగా ఈయనే..

Update: 2019-05-17 05:10 GMT
ఈసారి పట్టువదలవద్దని కాంగ్రెస్ భావిస్తోంది. వదిలితే ఇక కాంగ్రెస్ కనుమరుగేనన్న కఠిన వాస్తవం భయపెడుతోంది. అందుకే ఏకంగా సోనియానే రంగంలోకి దిగి యాక్టివ్ పాలిటిక్స్ నెరుపుతున్నారు. ప్రాంతీయ పార్టీల నేతలను మచ్చిక చేసుకునే పనిలో బిజీగా ఉంది.

కేంద్రంలో హంగ్ వస్తుందన్న అంచనాల నేపథ్యంలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోంది. బీజేపీ వ్యతిరేక పార్టీలు, తటస్థంగా ఉన్న పార్టీల మద్దతును కూడగట్టుకునేందుకు తగిన వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ లో సీనియర్ నేత అయిన, మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ కు సోనియాగాంధీ కీలక బాధ్యతలను అప్పగించినట్టు తెలుస్తోంది.

మధ్యప్రదేశ్ కు సమీపంలో ఉన్న తెలంగాణ, ఒడిషా, ఏపీ రాష్ట్రాల బాధ్యతను కమల్ నాథ్ కు సోనియా అప్పగించినట్టు సమాచారం. ఆయన కేసీఆర్, జగన్, నవీన్ పట్నాయల్ తో అనధికారికంగా తొలుత చర్చలు జరుపుతారని తెలుస్తోంది. ఈ ముగ్గురు అటు బీజేపీకి, ఇటు యూపీఏకి మద్దతు తెలుపకుండా తటస్థంగా ఉంటున్నారు.

కమల్ నాథ్ బృందంలో ఇద్దరు ఏఐసీసీ నాయకులు ఉంటారని.. ప్రాంతీయ పార్టీల డిమాండ్లు, అభిప్రాయాలు, పొత్తులో పదవుల గురించి తెలుసుకొని అధిష్టానానికి విన్నవిస్తారు. కేంద్రంలో యూపీఏకి సపోర్టు చేయడానికి వారి డిమాండ్లను తెలుసుకుంటారని సమాచారం.

అయితే కేంద్రంలో ఏ పార్టీకి ప్రత్యేక హోదా ఇస్తే ఆ పార్టీకే జగన్ మద్దతిస్తానని ఇప్పటికే స్పష్టం చేశారు. రాతపూర్వకంగా హోదాపై హామీనిస్తే కాంగ్రెస్ కు మద్దతునిచ్చే అవకాశం ఉంది.ఇక కేంద్రంలో చక్రం తిప్పాలనుకుంటున్న కేసీఆర్ ఏ పార్టీ భారీ ఆఫర్ ఇస్తే ఆ పార్టీతో కలుస్తారు.

అయితే తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ చేసిన ప్రకటన కేసీఆర్ ఆశలను పెంచింది. బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి తాము ప్రధాన మంత్రి పదవిని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఏఐసీసీ సభ్యుడు గులాంనబీ ఆజాద్ చెప్పడం సంచలనంగా మారింది. మొత్తంగా కాంగ్రెస్ ఈసారి బీజేపీని గద్దె దించడానికి ఎంతవరకైనా చేయడానికి రెడీ కావడం విశేషం.
    
    
    

Tags:    

Similar News