ఆయన సాక్షాత్తు పార్లమెంటు సభ్యుడు. కట్టుదిట్టమైన భద్రత ఉండే ఎయిర్ పోర్ట్ లో ఆ ఎంపీ ఉండగా...ఓ వ్యక్తి తలకు తుపాకి గురిపెట్టాడు. దీంతో అవాక్కవడం అందరి వంతు అయింది. ఈ పని చేసింది సాక్షాత్తు విధుల్లో ఉన్న కానిస్టేబుల్. అలాంటి పరిణామంతో అవాక్కయింది ప్రతిపక్ష ఎంపీ. ఆయన కాంగ్రెస్ సీనియర్ నేత - లోక్ సభ ఎంపీ కమల్ నాథ్. ఈ ఘటన జరిగింది చింద్వారా విమానాశ్రయంలో. శుక్రవారం సాయంత్రం చింద్వారా విమానాశ్రయానికి వచ్చిన కమల్ నాథ్ ఢిల్లీ విమానం ఎక్కేందుకు సిద్ధమవుతుండగా...ఈ ఘటన చోటుచేసుకుంది.
విమానం ఎక్కేందుకు కమల్ నాథ్ సిద్ధమవుతుండగా...ఆయన భద్రత కోసం వచ్చిన ఓ కానిస్టేబుల్ ఆయన తలకు లోడ్ చేసి ఉన్న తుపాకి గురిపెట్టాడు. దీంతో షాక్ తిన్న మిగతా కానిస్టేబుల్ ను ఆయన్ను అదుపులోకి తీసుకొని డ్యూటీ పోలీసులకు అప్పగించారు. అనంతరం ఆయన్ను విచారించగా సదరు వ్యక్తి పేరు రత్నేష్ పవార్ అని గుర్తించారు.
ఈ పరిణామంలో సదరు కానిస్టేబుల్ రత్నేష్ ఆశ్చర్యకరమైన వాదన వినిపిస్తుండటం గమనార్హం. అసలు అప్పుడేం జరిగిందో తనకు తెలియదని ఆయన వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. తనకేం గుర్తుకు లేదని ఆయన తేల్చేస్తుండటం విశేషం. ఈ ఘటనపై అడిషనల్ ఎస్పీ నీరజ్ సోని స్పందించారు. ఈ ఉదంతంపై పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నామని పేర్కొంటూ ఇప్పటికే ఆ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశామని వెల్లడించారు.