కానిస్టేబుల్ ను ఆ ఎంపీ కుటుంబ స‌భ్యులు చిత‌క‌బాదింది అందుకేనా?

Update: 2022-07-05 08:15 GMT
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భీమ‌వ‌రం పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లో విధి నిర్వహణలో ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ ఫరూక్‌ బాషాపై ఎంపీ రఘురామకృష్ణరాజు కుటుంబ సభ్యులు దాడికి పాల్ప‌డ్డారు అని ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కు చెందిన సాక్షి దిన‌ప‌త్రిక ఓ సంచ‌ల‌న‌ క‌థ‌నం ప్ర‌చురించింది. సోమవారం ఉదయం విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ఫ‌రూక్ బాషాపై దాడి చేసి, అత‌డిని ఎంపీ ర‌ఘురామ మ‌నుషులు కిడ్నాప్‌ చేశార‌ని పేర్కొంది.

అత‌డిని కిడ్నాప్ చేసే ముందు ఎంపీకి భ‌ద్ర‌త‌గా ఉన్న కొందరు సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుళ్లతో ర‌ఘురామ కుటుంబ స‌భ్యులు వచ్చి నడిరోడ్డుపైనే ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ను చిత‌క‌బాదార‌ని సాక్షి ప‌త్రిక వెల్ల‌డించింది. అంతేకాకుండా కానిస్టేబుల్ ఫ‌రూక్ బాషా ఐడీ కార్డు లాక్కొని, ఈడ్చుకుంటూ ఎంపీ ఇంటికి తీసుకెళ్లార‌ని వివ‌రించింది.

ఎంపీ ఇంటిలో రెండు గంటలకు పైగా కానిస్టేబుల్ ను చిత్రహింసలకు గురిచేశార‌ని తెలిపింది. అనంతరం అనుమానిత వ్యక్తిగా గచ్చిబౌలి పోలీసులకు అప్పగించార‌ని పేర్కొంది. కానిస్టేబుల్ పై దాడి జ‌రుగుతున్న‌ సమయంలో ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంట్లోనే ఉన్నార‌ని తెలిపింది.

ఈ ఘ‌ట‌న‌పై ఓవైపు ఎంపీ కుటుంబ స‌భ్యులు, మ‌రోవైపు కానిస్టేబుల్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కాగా త‌న ఇంటి స‌మీపంలో త‌చ్చట్లాడుతుంటే గుర్తు తెలియ‌ని వ్య‌క్తిగా భావించి త‌న అనుచ‌రులు అత‌డిని ప్ర‌శ్నించార‌ని ఎంపీ చెబుతున్నారు. మ‌రోవైపు కానిస్టేబుల్ వాద‌న మ‌రోలా ఉంది. ప్ర‌ధాన‌మంత్రి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప‌ర్య‌టిస్తున్న నేప‌థ్యంలోనే నిఘా డ్యూటీలో ఉన్నాన‌ని కానిస్టేబుల్ చెబుతున్నారు. అయితే తాను ఉన్న‌ది ఎంపీ ఇంటికి కిలోమీట‌ర్ దూరంలో అని కానిస్టేబుల్ చెబుతున్నాడు.

హైద‌రాబాద్, విజయవాడ, భీమవరంలలో ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకునేందుకు ఆందోళనలకు కొందరు సిద్ధమవుతున్నట్టు పోలీసులు గుర్తించారని చెబుతున్నారు.

దాంతో ఏపీ నుంచి హైదరాబాద్‌ వచ్చిన సంఘాల ప్రతినిధులు, ఆందోళనకారులు, అనుమానితుల కదలికలను గుర్తించేందుకు ఏపీ ఇంటెలిజెన్స్‌ విభాగం కొందరు కానిస్టేబుళ్లను హైదరాబాద్‌లో స్పాటర్స్‌గా నియమించింద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఏపీ అధికారులు అనంతపురానికి చెందిన కానిస్టేబుల్‌ ఫరూక్‌ బాషాను హైదరాబాద్‌లోని ఐఎస్‌బీ గేటు వద్ద స్పాటర్‌గా నియమించార‌ని స‌మాచారం.
Tags:    

Similar News