జ‌గ‌న్‌ తో నాగ్ భేటీ!..గ‌ల్లాకు త‌డిసిపోతోందే!

Update: 2019-02-19 13:58 GMT
వైసీపీలో చేరిక‌లు టీడీపీకి, ఆ పార్టీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడును పూర్తిగా డిఫెన్సివ్ మోడ్‌ లోకి నెట్టేశాయి. రోజుకో నేత చొప్పున టీడీపీకి రాజీనామాలు చేస్తున్న నేత‌లు... నేరుగా హైద‌రాబాద్ లోని లోట‌స్ పాండ్‌ లో ప్ర‌త్య‌క్ష‌మైపోతున్నారు. ఆ వెంట‌నే వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేత వైసీపీ కండువాలు వేయించుకుని ఆ పార్టీలో చేరిపోతున్నారు. ఈ త‌ర‌హా షాకులు ఒక‌దాని వెంట మ‌రొక‌టి త‌గులుతున్న నేప‌థ్యంలో నిజంగానే ఇప్పుడు చంద్ర‌బాబుకు మైండ్ బ్లాంక్ అవుతోంద‌నే చెప్పాలి. మొన్న‌టికి మొన్న ఈ త‌ర‌హా షాకుల‌కు ప‌రిష్కారం క‌నుక్కోవాల‌ని, పార్టీ నేత‌ల‌ను నిలువ‌రించాల‌ని ఆయ‌న ఏకంగా పొలిట్ బ్యూరో భేటీ స‌మావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే అక్క‌డ ప‌రిష్కారం దొర‌క్క‌పోగా... వ‌ల‌సలు మరింత‌గా పెరిగిపోయాయి.

ఈ క్ర‌మంలో ప్ర‌ముఖ సినీ న‌టుడు అక్కినేని నాగార్జున నేటి మ‌ధ్యాహ్నం జ‌గ‌న్‌ తో భేటీ కావ‌డంతో చంద్రబాబుతో పాటు టీడీపీకి చెందిన ప‌లువురు కీల‌క నేత‌ల‌కు భారీ షాకే త‌గిలింద‌ని చెప్పాలి. జ‌గ‌న్‌ తో నాగార్జున‌కు మంచి సంబంధాలున్న విష‌యం తెలిసిందే. అంతేకాకుండా జ‌గ‌న్‌ తో వ్యాపార బంధాలు ఉన్న ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్ కూడా నాగార్జును మంచి స్నేహితులే. వీరిద్ద‌రి మ‌ధ్య వ్యాపార ప‌ర సంబంధాలు కూడా ఉన్నాయి. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ తో నాగార్జున భేటీకి టీడీపీ నేత‌లు అంత‌గా షాక్‌ కు గురి కావాల్సిన అవ‌స‌రం లేదనే చెప్పాలి. అయితే అంత‌ర్గ‌తంగా గుట్టుచ‌ప్పుడు కాకుండా జ‌రిగిపోతున్న ప‌రిణామాలను ఏదో రూపంగా తెలుసుకుంటున్న నేప‌థ్యంలో టీడీపీ నేత‌లు వ‌ణికిపోతున్నార‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. జ‌గ‌న్ తో నాగ్ భేటీ జ‌రిగిన త‌ర్వాత అంద‌రి కంటే ముందుగా వ‌ణికిపోయింది మాత్రం గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవేన‌ని చెప్పాలి. పారిశ్రామికంగా మంచి పేరున్న ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన గల్లా జ‌య‌దేవ్‌... సూప‌ర్ స్టార్ కృష్ణ కుమార్తెను వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో సినీ ఇండ‌స్ట్రీతోనూ గ‌ల్లాకు మంచి సంబంధాలే ఉన్నాయ‌ని చెప్పాలి.

ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ తో నాగ్ భేటీ వెన‌క ఉన్న అసలు కార‌ణాల‌ను తెలుసుకున్న గ‌ల్లా షాక్ తిన్నార‌ట‌. దీంతో అప్ప‌టిక‌ప్పుడే మీడియా ముందుకు ప‌రుగెత్తుకుంటూ వ‌చ్చిన గ‌ల్లా... న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌ల‌కు శ్రీ‌కారం చుట్టారు. గ‌ల్లా తెలుసుకున్న విష‌యం ఏమిటంటే... వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు పోటీగా గుంటూరు పార్ల‌మెంటు నుంచి నాగ్ ను వైసీపీలోకి బ‌రిలోకి దించుతోంద‌ట‌. దీంతో ఎక్క‌డ తాను గ‌ల్లంతువుతానోన‌న్న భ‌యంతోనే గ‌ల్లా మీడియా ముందుకు వ‌చ్చిన‌ట్లుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. అయినా మీడియా ముందుకు వ‌చ్చిన గ‌ల్లా ఏమ‌న్నార‌న్న విష‌యానికి వ‌స్తే... *జ‌గ‌న్ తో నాగార్జున భేటీ, గుంటూరు నుంచి ఆయ‌న పోటీ చేస్తార‌న్న విష‌యం నాకు తెలియదు. నేను వైసీపీలో లేను. హైదరాబాద్ లోనూ లేను. కాబట్టి దాని గురించి కామెంట్ చేయలేను. ఆయన వస్తాడని నేను అనుకోవట్లేదు. నేను, నాగార్జున మంచి ఫ్రెండ్స్. ఆయన ఏదైనా చేసేట్టయితే, నాతో మాట్లాడి చేస్తారు కాబట్టి, నేను నమ్మను* అన్నారు. మొ్త్తంగా ఈ మాట‌ల‌తోనే... జ‌గన్ తో నాగ్ భేటీ గ‌ల్లాను ఏ మేర‌కు వ‌ణికించిందో ఇట్టే తెలిసిపోయిందిగా.

ఇదిలా ఉంటే... జ‌గ‌న్‌ తో త‌న బేటీకి ఎలాంటి రాజ‌కీయ ప్రాధాన్యం లేద‌ని నాగార్జున ప్ర‌క‌టించారు. రాజకీయాల‌పై త‌న‌కు ఆసక్తి లేద‌న్న ఆయ‌న‌, ఎవ‌రికో టికెట్ కోసం కూడా తాను జ‌గ‌న్ వ‌ద్ద‌కు వెళ్ల‌లేద‌ని తెలిపారు. జ‌గ‌న్ త‌నకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని, ఇటీవ‌లే ఆయ‌న సుదీర్ఘ పాద‌యాత్ర ముగంచుకున్న నేప‌థ్యంలో ఆయ‌న‌కు అభినంద‌న‌లు తెలిపేందుకే జ‌గ‌న్‌తో భేటీ అయ్యాన‌ని నాగ్ తెలిపారు. ఈ ప్ర‌క‌ట‌న ద్వారా జ‌గ‌న్ తో త‌న భేటీపై జ‌రుగుతున్న పొలిటిక‌ల్ ప్ర‌చారానికి నాగ్ ముగింపు ప‌లికార‌ని చెప్పాలి.
Tags:    

Similar News