కన్నా అక్కడ సున్నానా... వైసీపీకి కన్నెర్రగానా...?

Update: 2023-02-22 07:00 GMT
మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ రాజకీయం కాదు కానీ చాలా పార్టీలకు కన్నెర్ర అవుతున్నారు. ముందుగా చెప్పుకోవలసింది ఆయన నిన్నటికి నిన్న విడిచిన బీజేపీకి ప్రధానంగా టార్గెట్ అయ్యారు. అన్నీ ఆయనకు ఇచ్చామని,  ఆయన గౌరవానికి ఏ మాత్రం భంగం కలిగించలేదని అలాంటిది ఆయన ఇపుడు పార్టీని వీడివెళ్తున్నారని ఎంపీ జీవీఎల్ నరసింహారావు కన్నా రాజీనామా మీద ఘాటైన కామెంట్స్ చేశారు.

కన్నా గురించి తాను ఏమీ మాట్లాడబోను ఆయన గతంలో తన మీద విమర్శలు చేశారు, ఇపుడు చేస్తున్నారు అంటూ మాట్లాడకుండానే మండిపోయారు బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు. ఇక బీజేపీ నుంచి కన్నాకు ఎన్ని రకాలైన విమర్శలు వస్తాయో తరువాత తెలుస్తుంది. బీజేపీలోకి వెళ్ళిన కన్నా అక్కడ నుంచి బయటపడేందుకు మధ్యలో వైసీపీ అని మరోసారి అన్నారు ఆ తరువాత జనసేన తో కూడా సంప్రదింపులు జరిపారు అని అంటున్నారు.

ఏకంగా నాదెండ్ల మనోహర్ ఆయన ఇంటికి వచ్చి మాటా మంతీ చేసి వెళ్లారు. దాంతో కన్నా చేరేది జనసేనలోనే అని అంతా అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే ఆయన టీడీపీలోకి చేరుతున్నారు. దీంతో సహజంగానే జనసేనలోనూ కోపం ఉంటుంది అని అంటున్నారు. ఇక వైసీపీ అయితే కన్నా విషయంలో చాలా ఆగ్రహంగా ఉంది అని అంటున్నారు. దానికి కారణం ఏంటి అంటే ఇప్పటికి రెండు సార్లు ఆయన వైసీపీకి హ్యాండ్ ఇచ్చారుట.

అంటే బీజేపీ జనసేనల కంటే  కూడా వైసీపీకే ఎక్కువ కోపం వచ్చి ఉండడం సహజం. కన్నా 2019 ఎన్నికల ముందు వైసీపీలోనే చేరాలి. కండువాలు అన్నీ సిద్ధం అయ్యాయి. తెల్లారితే ఆ ముచ్చట జరగాల్సి ఉండగా రాత్రికి రాత్రి ఏమి జరిగిందో కానీ ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆ తరువాత కొన్నాళ్ళు మిన్నకుండి బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. అది ఫస్ట్ టైం హ్యాండ్ ఇవ్వడాం అయితే రెండవసారి హ్యాండ్ ఇవ్వడం ఈ మధ్యనే జరిగిందట.

తాను వైసీపీలోకి వస్తున్నాను అంటూ సంకేతాలు ఇచ్చి మరీ ఆయన టీడీపీ లో  చేరడంతోనే ఆ పార్టీ నాయకులు మండిపోతున్నారు. దాని మీద మంత్రులతో మొదలెట్టి లోకల్ లీడర్స్ దాకా అంతా ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు మంత్రి గుడివాడ అమరనాధ్ అయితే కన్నా ఎక్కడికి వెళ్ళినా సున్నావే అని ఒక సెటైర్ వేశారు కన్నా చంద్రబాబును ఇష్టం వచ్చినట్లుగా విమర్శించి ఇపుడు అదే పార్టీలో చేరుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన వైఖరి అంతే అంటున్నారు.

ఇక అదే పార్టీకి చెందిన గుంటూరు మేయర్ సహా ఇతర నాయకులు కన్నాకు వార్నింగ్ ఇస్తున్నారు. వైసీపీలో చేరాలని చూసిన కన్నా ఇపుడు తమ పార్టీని తమ ముఖ్యమంత్రిని  విమర్శించాలనుకోవడం దారుణమని అన్నారు. మా సీఎం పైనా పార్టీ పైన మాట్లాడితే చూస్తూ ఊరుకోమని గట్టిగానే హెచ్చరిస్తున్నారు. మరి కన్నా కూడా జోరు తగ్గించడంలేదు. ఇంకా సైకిలెక్కలేదు కానీ జగన్ మీద తన గన్ గురిపెట్టారు. వైసీపీ మీద ఘాటైన కామెంట్స్ చేస్తున్నారు. దీనిని బట్టి చూస్తూంటే రానున్న రోజుల్లో కన్నా వర్సెస్ వైసీపీ అన్నట్లుగా పొలిటికల్ డైలాగ్ వార్ నడచినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News