ఆ ఎంపీని చూసి అంతా బుద్ధి తెచ్చుకోవాలి

Update: 2016-12-18 11:22 GMT
లోక్ సభ కానీ - రాజ్యసభ కానీ ఎంపీలంటే ఇష్టమొచ్చినప్పుడు వెళ్తారు.. ఇష్టం లేకుంటే వచ్చేస్తారనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. అందుకు తగ్గట్లుగానే చాలామంది అసలు పార్లమెంటుకు సరిగా అటెండ్ కారు. కనిపించి అటెండెన్సు వేయించుకుని వచ్చేసేవారు కొందరైతే మరికొందరు మాత్రం నిత్యం వెళ్తుంటారు. వారిలోనూ కొందరే యాక్టివ్ గా ఉంటూ ప్రజలకు పనికొచ్చే ప్రశ్నలడుగుతూ చర్చల్లో పాల్గొంటుంటారు. ఇంకొందరు మాత్రం వెళ్లామా వచ్చామా అన్నట్లు ఉంటారు. జీతాలు - భత్యాలు తీసుకోవడంలో మాత్రం ఏమాత్రం తగ్గరు. కానీ... తాజాగా ఓ ఎంపీ మాత్రం అందరికంటే భిన్నంగా వ్యవహరించి ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆయనే ఒడిశాలోని బిజూ జనతాదళ్ పార్టీకి చెందిన ఎంపీ బైజయంత్ పండా... రాజకీయ వర్గాల్లో జయ్ పండాగా చిరపరిచితుడైన ఆయన సంచలన ప్రతిపాదన చేశారు. శీతాకాల సమావేశాల్లో వృథా అయిన సమయానికి సరిపడా మొత్తాన్ని మినహాయించుకుని తనకు మిగతా మొత్తం మాత్రమే వేతనంగా ఇవ్వాలని ఆయన కోరారు.
    
పార్లమెంటులో ప్రజా సమస్యలపై చర్చలు చేయకుండా..సమయం వృథా చేశామని జయ్ పండా ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలకు హాజరైనందుకుగానూ తనకు చెల్లించిన మొత్తాన్ని (వృథా చేసిన సమయం తాలుకూ మొత్తం) వాపస్ చేస్తానని ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. పండా ట్వీట్‌కు విశేషమైన స్పందన వస్తోంది.
    
రాజకీయాల్లో ఆదర్శవంతంగా నిలిచారని వివిధ వర్గాలు ఆయనను మెచ్చుకుంటున్నాయి. పండా కేంద్రపర లోక్ సభ స్థానం నుంచి ఎన్నికయ్యారు. ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే పండా ఆంగ్ల పత్రికల్లో అనేక అంశాలపై వ్యాసాలు రాస్తుంటారు. కేంద్రం తీసుకునే నిర్ణయాలను రాజకీయాలతో సంబంధం లేకుండా మంచిదైతే మంచిదని.. మంచిది కాకుంటే మంచిది కాదని నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు వెల్లడిస్తుంటారు.  నీతిమంతుడైన ముఖ్యమంత్రిగా పేరున్న నవీన్ పట్నాయిక్ పార్టీ బీజేడీ సభ్యుడైన పండా ఇప్పుడు తమ నేత ఆదర్శాన్ని పుణికిపుచ్చుకుంటూ మిగతా ఎంపీలంతా సిగ్గుపడేలా ఆదర్శవంతంగా నిలిచారు. ఆయన ప్రతిపాదనకు ప్రభుత్వం ఎలా రెస్పాండడుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News