టీ ఎంపీల్ని చూసైనా ఏపీ ఎంపీలు మార‌తారా?

Update: 2016-03-15 09:44 GMT
అడ్డ‌గోలుగా రాష్ట్రాన్ని విభ‌జించారంటూ ఓప‌క్క ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌దే ప‌దే వ్యాఖ్య‌లు చేస్తుంటారు. విభ‌జ‌న కార‌ణంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం తీవ్రంగా న‌ష్ట‌పోయింద‌న్న ఆవేద‌న‌ను త‌ర‌చూ వినిపిస్తుంటారు. ఏపీకి అందాల్సినంత కేంద్ర‌సాయం అంద‌లేద‌న్న అసంతృప్తి వ్య‌క్తం చేస్తుంటారు. ఇవ‌న్నీ ప్రెస్ మీట్ల‌లోనూ.. కొన్ని స‌మావేశాల్లోనే త‌ప్పించి.. స‌రైన వేదిక మీద ఏపీకి జ‌రుగుతున్న అన్యాయం గురించి బ‌ల‌మైన వాద‌న‌ను వినిపించింది లేదు. అదేమంటే.. మోడీ స‌ర్కారుతో ఉన్న మిత్ర‌ధ‌ర్మంగా తెలుగుత‌మ్ముళ్లు వాపోతారు.

మిత్ర‌ధ‌ర్మం అంటూ గ‌డిచిన 23 నెల‌లుగా మోడీ స‌ర్కారుకు ద‌న్నుగా ఉన్నా ఏపీకి జ‌రిగిన లాభం ఏమైనా ఉందా? అంటూ గుండు సున్నా అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇప్ప‌టికీ.. విభ‌జ‌న సంద‌ర్భంగా ఇచ్చిన హామీల‌న్నీ తీరుస్తామ‌ని చెప్ప‌ట‌మే కాదు.. తీర్చిన‌వి ఎన్ని అన్న లెక్క చూస్తే పెద్ద గుండు సున్నా అన్న‌ది త‌ప్ప మ‌రింకేమీ క‌నిపించ‌దు.

ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశంపై పార్ల‌మెంటు ఉభ‌య‌స‌భ‌ల్లో కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆందోళ‌న వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఇంత‌కాలం కామ్ గా ఉన్న కాంగ్రెస్ ఈ రోజున.. ఏపీకి ప్ర‌త్యేక హోదా గురించి గ‌ళం విప్ప‌టం వెనుక రాజ‌కీయ కోణాన్ని మ‌ర్చిపోలేం. కానీ.. ఇక్క‌డ కాంగ్రెస్ రాజ‌కీయ ప్ర‌యోజ‌నం కంటే కూడా.. వారి మాట కార‌ణంగా ఏపీకి క‌లిగే ప్ర‌యోజ‌నం చాలా ముఖ్యం. అయితే.. మిత్రుడిని ఇబ్బంది పెట్ట‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో తెలుగు ఎంపీలు మౌన‌ముద్ర‌ను దాల్చారు.

ఇదిలా ఉంటే.. లోక్‌ స‌భ‌లో ఏపీ ప్ర‌త్యేక హోదా గురించి ఏపీకి చాలా చేసిన‌ట్లుగా గొప్ప‌లు చెప్పుకున్న మంత్రి వెంక‌య్య‌నాయుడు... ఏపీనే కాదు.. తెలంగాణ విష‌యంలోనూ తాము చేయాల్సిన‌వ‌న్నీ చేస్తామంటూ చెప్పుకున్నారు. వెంట‌నే స్పందించిన తెలంగాణ ఎంపీ జితేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ‌కు ఇచ్చిన హామీల్ని ఇప్ప‌టివ‌ర‌కూ పూర్తి చేయ‌లేద‌ని చెప్పుకొచ్చి గాలి తీశారు. తెలంగాణ రాష్ట్రం విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రించినా ఫైర్ బ్రాండ్ల మాదిరి తెలంగాణ ఎంపీలు చెల‌రేగిపోతుంటే.. మొత్తంగా మునిగిపోయిన ఏపీ ఎంపీలు మాత్రం నోరు విప్ప‌కుండా మౌనంగా ఉండ‌టం క‌నిపిస్తుంది. ఇదంతా చూసిన‌ప్పుడు.. టీ ఎంపీల్ని చూసైనా ఏపీ త‌మ్ముళ్లు త‌మ తీరు మార్చుకుంటే బాగుండ‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. ఇలాంటివి త‌మ్ముళ్ల నుంచి ఆశించ‌టం మ‌రీ అత్యాశే అవుతుందేమో..!
Tags:    

Similar News