కేటీఆర్ సాయం వ‌ద్ద‌న్న చిన్నారి దివ్య‌!

Update: 2018-08-27 04:13 GMT
అత్యుత్త‌మ స్థానాల్లో ఉన్న వారు ముందుకొచ్చి సాయం చేస్తామంటే త‌లాడిస్తారే కానీ.. వద్ద‌న్న మాట వినిపించ‌దు. అందుకు భిన్నంగా త‌న తీరుతో మంత్రి కేటీఆర్ మ‌న‌సును దోచుకుంది చిన్నారి దివ్య‌. రోడ్లు ప్ర‌మాదంలో మృత్యువుతో పోరాడిన ఆమెకు.. స‌రైన స‌మ‌యంలో మంత్రి కేటీఆర్ అందించిన ఆర్థిక సాయంతో ఆమె కోలుకునేలా చేసింది. అయితే.. ఈ ప్ర‌మాదంలో ఆమె ఎడ‌మ‌కాలిని పోగొట్టుకుంది.

రాఖీ సంద‌ర్భంగా త‌న‌కు ప్రాణ దానం చేసిన మంత్రి కేటీఆర్ కు రాఖీ క‌ట్టాల‌ని భావించింది. దీనికి మంత్రి ఓకే అన‌టంతో ఆమెను త‌న నివాసానికి పిలిపించుకొని మ‌రీ రాఖీ క‌ట్టించుకున్నారు. కిరాయి ఆటో న‌డుపుకుంటూ జీవ‌నోపాధి పొందే దివ్య తండ్రి ఆర్థిక దుస్థితి గురించి తెలిసిన కేటీఆర్.. ఆసుప‌త్రిలో ఉన్న దివ్య‌కు సాయం చేశారు. త‌న‌ను ఆదుకున్న కేటీఆర్ చేత రాఖీ క‌ట్టించుకోవాల‌న్న ఆశ‌ను తెలుసుకున్న ఆయ‌న త‌న ఇంటికి పిలిచి.. కాలు లేని దివ్య‌కు కృత్రిమ కాలును అంద‌జేశారు. ఇంకేదైనా సాయం కావాలా? అని అడిగారు.

దీనికి  తొమ్మిదేళ్ల దివ్య త‌న‌కు ఎలాంటి సాయం అక్క‌ర్లేద‌ని.. సొంత సోద‌రుడిలా కేటీఆర్ క‌ట్టిన రాఖీ స‌రిపోతుంద‌న్న మాట ఆయ‌న్ను మ‌రింత ముచ్చ‌ట‌కు గురి చేసింది. దివ్య తండ్రి కిరాయి క‌ట్టుకొని ఆటో న‌డుపుతార‌న్న విష‌యాన్ని తెలుసుకున్న మంత్రి కేటీఆర్‌.. త్వ‌ర‌లోనే ఆయ‌న‌కో కొత్త ఆటోను త‌న రాఖీ బ‌హుమ‌తిగా అందిస్తాన‌ని మాట ఇచ్చారు. మంత్రి మాట‌కు దివ్య త‌ల్లిదండ్రులు త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు.. సోద‌రి క‌మ్ ఎంపీ క‌విత మంత్రి కేటీఆర్ కు ఆయ‌న ఇంట్లో రాఖీ క‌ట్టారు.  కేటీఆర్ సోద‌రి శైలిమ క‌విత భ‌ర్త అనిల్ కుమార్ కు రాఖీ క‌ట్టారు.
Tags:    

Similar News