కాంగ్రెస్ టికెట్ల‌పై ఎంపీ క‌విత సూప‌ర్ ట్విస్ట్‌

Update: 2018-11-12 16:22 GMT
     టీఆర్ ఎస్‌ ను ఓడించడమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ - టీడీపీ - సీపీఐ - టీజేఎస్ మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే మహాకూటమిలో సీట్ల సర్దుబాటు పెద్ద సమస్యగా మారింది. భాగస్వామ్య పక్షాలకు కేటాయించిన సీట్లు - నియోజకవర్గాలపై వివాదం నెలకొంది. మేము కోరినన్ని సీట్లు - అడిగిన నియోజకవర్గాలు ఇవ్వాల్సిందేనని టీడీపీ - టీజేఎస్ - సీపీఐ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో అభ్యర్థుల జాబితాను ప్రకటించడంలో కాంగ్రెస్‌ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలైనా... ఇంకా - అభ్యర్థులను ఖరారు చేయకపోవడం కాంగ్రెస్ స‌త్తాకు నిద‌ర్శ‌న‌మ‌ని కూడా ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరు పై రాహుల్ గాంధీ సీరియస్ అయ్యారు.ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనా... పొత్తుల వ్యవహారాన్ని ఇంకా తేల్చకపోవడంపై ఈ సందర్భంగా రాహుల్ అసహనం వ్యక్తం చేశారు. వెంటనే అభ్యర్థులను ప్రకటించాలని ఆదేశించారు.

ఇలా మ‌హాకూట‌మి - అంత‌ర్గ‌తంగా కాంగ్రెస్ పార్టీ ప‌రిణామాలు హాట్ హాట్‌ గా మారుతున్న స‌మ‌యంలో టీఆర్ ఎస్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. కాంగ్రెస్ టికెట్లు ఖ‌రారు కాలేద‌ని అనుకుంటున్నార‌ని, అయితే ఇప్ప‌టికే ఖ‌రారయ్యాయ‌ని ఆమె వ్యాఖ్యానించారు. కనీసం తమ అభ్యర్థులను కూడా ఖరారు చేసుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని ఆమె విమర్శించారు. అమరాతిలో కాంగ్రెస్ జాబితా ఫైనల్ అయింద‌ని ఎంపీ కవిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను అమరావతి తీసుకెళ్లి చంద్రబాబుతో ఆమోద ముద్ర వేయించుకోవడం కాంగ్రెస్ దయనీయ దుస్థితికి అద్దం పడుతుందన్నారు. తెలంగాణలో చంద్రబాబు బ్యాక్‌ డోర్ రాజకీయాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఎన్నికల్లో మహాకూటమికి ఓటమి తప్పదని - ఆ కూటమికి ప్రజలే బుద్ధి చెబుతారని కవిత వ్యాఖ్యానించారు. గత 40 ఏళ్లలో రాష్ట్రంలో జరగని అభివృద్ధి ఈ నాలుగేళ్లలోనే జరిగిందని కవిత చెప్పారు. దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణను నిలుపుదామని కవిత పిలుపునిచ్చారు.
Tags:    

Similar News