మీడియా చాన‌ళ్లు రేటింగ్ కోసమే అలా చేశాయంటున్న టీడీపీ ఎంపీ!

Update: 2022-08-16 10:32 GMT
టీడీపీలో తాను అసంతృప్తిగా ఉన్నాన‌నే మాట అవాస్త‌వ‌మ‌ని విజ‌య‌వాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని స్ప‌ష్టం చేశారు. తాను అసంతృప్తిగా ఉన్నాన‌నేది కేవ‌లం మీడియా సృష్టి మాత్ర‌మే అన్నారు. యూట్యూబ్ చానెళ్ల‌కు పోటీగా కొన్ని టీవీ చానెళ్లు టీఆర్పీ రేటింగుల కోసం త‌న‌పై అవాస్తవ క‌థ‌నాలు ప్ర‌సారం చేస్తున్నాయ‌ని కేశినేని నాని అంటున్నారు. పార్టీ అవ‌స‌రాల మేర‌కు తాను వ‌చ్చే ఎన్నికల్లో విజ‌య‌వాడ నుంచి పోటీ చేస్తాన‌ని లేదంటే పార్టీ విజ‌యం కోసం ప‌నిచేస్తాన‌ని చెబుతున్నారు.

తాను ఎలాంటి విషయాల్లోనూ జోక్యం చేసుకోనని కేశినేని నాని తేల్చిచెప్పారు. తనపై ఏ విధమైన విమర్శలూ చేయలేరని అన్నారు. పార్టీతో గ్యాప్‌ ఉందంటూ మాత్రమే త‌న‌పై త‌ప్పుడు ప్రచారం చేయగలరని విమ‌ర్శించారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యవహారం ఆయ‌న‌ వ్యక్తిగతం కాదని, అది మహిళలకు సంబంధించిందన్నారు. ఈ మేర‌కు విజ‌య‌వాడ‌లో కేశినేని నాని మీడియాతో మాట్లాడారు.

కాగా 76వ స్వాతంత్య్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని గ‌వ‌ర్న‌ర్ విశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ ఆగ‌స్టు 15న‌ ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మానికి కేశినేని నాని హాజ‌ర‌య్యారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ప‌క్క‌నే కూర్చుని ఆయ‌న‌తో మాట్లాడుతూ క‌నిపించారు. ఆ త‌ర్వాతే కేశినేని నాని తాను టీడీపీలో అసంతృప్తిగా లేనంటూ వ్యాఖ్య‌లు చేయ‌డంతో ప్రాధాన్య‌త ఏర్ప‌డింది.

కాగా గ‌త విజ‌య‌వాడ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌ప్పుడే నుంచి నాని త‌న వ్యాఖ్య‌ల తీవ్ర‌త‌ను పెంచారు. విజ‌య‌వాడ టీడీపీలో ముఖ్య నేత‌లుగా ఉన్న బుద్ధా వెంక‌న్న‌, నాగుల్ మీరా వ‌ర్గాల‌తో కేశినేని నానికి విబేధాలున్నాయ‌ని స‌మాచారం. విజ‌య‌వాడ టీడీపీ మునిసిప‌ల్ మేయ‌ర్ అభ్య‌ర్థిగా కేశినేని నాని కుమార్తె శ్వేత‌ను ప్ర‌క‌టించిన‌ప్పుడు బుద్ధా వెంక‌న్న‌, నాగుల్ మీరా వ‌ర్గాలు మొద‌ట ఒప్పుకోలేదు. అలాగే త‌మ అనుచ‌రుల‌కు కార్పొరేట‌ర్ల‌గా టికెట్లు ఇప్పించుకోవ‌డంలోనూ ఈ ముగ్గురు నేత‌లు పోటీ ప‌డ్డారు.

అయితే చంద్ర‌బాబు మ‌ద్ద‌తు బుద్ధా వెంక‌న్న‌కే ఉంద‌ని తెలుసుకున్న కేశినేని నాని అప్ప‌టి నుంచి సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా టీడీపీ అధిష్టానంపై న‌ర్మ‌గ‌ర్భ‌లు వ్యాఖ్య‌లు చేస్తూ వ‌స్తున్నారు. త‌న‌కు పోటీగా త‌న సోద‌రుడు కేశినేని చిన్నిని చంద్ర‌బాబు ప్రోత్స‌హిస్తున్నార‌ని నాని గుస్సా అయిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఇటీవ‌ల పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల సంద‌ర్భంగా ఢిల్లీలో మీడియాతో ఆఫ్ ది రికార్డు మాట్లాడుతూ వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ టీడీపీకి క‌ష్ట‌మేన‌ని తేల్చిచెప్పారు. ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ లో పాల్గొన‌డానికి చంద్ర‌బాబు ఢిల్లీ వ‌చ్చిన‌ప్పుడు కూడా ఆయ‌న‌కు పుష్ప‌గుచ్ఛం ఇవ్వ‌డానికి నిరాక‌రించిన వీడియో టీడీపీలో వైర‌ల్ అయింది.

మ‌రోవైపు చంద్ర‌బాబు వీటినేమి ప‌ట్టించుకోకుండా కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత నిశ్చితార్థం కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. మ‌రోవైపు కేశినేని నాని.. చంద్ర‌బాబుకు పుష్ప‌గుచ్ఛం ఇవ్వ‌డానికి నిరాక‌రించ‌డంపై టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలు వ్య‌క్త‌మ‌య్యాయ‌ని స‌మాచారం. నానిని ఉపేక్షించ‌కుండా వేటేయాల‌ని.. క్ర‌మ‌శిక్ష‌ణ రాహిత్యాన్ని భ‌రిస్తే మిగిలిన‌వారు నానిని ఆద‌ర్శంగా తీసుకునే ప్ర‌మాదం ఉంద‌ని టీడీపీ నేత‌లు చంద్ర‌బాబుకు సూచించిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది.

తాను చంద్ర‌బాబుతో ప్ర‌వ‌ర్తించిన విధానం రెండు తెలుగు రాష్ట్రాల్లో వైర‌ల్ కావ‌డంతో కేశినేని నాని దిగివ‌చ్చార‌ని స‌మాచారం. త‌న‌కు పార్టీపైన అసంతృప్తి లేద‌ని.. ఇదంతా మీడియానే సృష్టిస్తోంద‌ని టీవీ చానెళ్ల‌వైపు తిప్పార‌ని అంటున్నారు. తాను పార్టీ కోసమే పనిచేస్తానని, అనవసర విషయాల్లో జోక్యం చేసుకోనని ప్రకటించారు.
Tags:    

Similar News