ఆ వీడియోపై ఎంపీ కేశినేని హాట్ కామెంట్స్!

Update: 2022-08-15 11:41 GMT
గ‌త కొంత‌కాలం టీడీపీ అధిష్టానంతో అంటీ ముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్న విజ‌య‌వాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను టీడీపీలో అసంతృప్తిగా లేనంటూనే త‌నలాంటి నానీలు ల‌క్ష‌మంది పుట్టుకొస్తార‌ని వ్యాఖ్యానించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఆయ‌న ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్య‌లు చేశారా అనేదానిపై చ‌ర్చ జ‌రుగుతోంది.

అలాగే తాను విజ‌య‌వాడకు ఎంపీగా లేక‌పోయినా న‌ష్టం ఏమీ ఉంద‌డ‌న్నారు. ఎప్పుడైనా తాను వాడే కార్లుపైనా ఎంపీ స్టిక్క‌ర్ క‌నిపించిందా అని ప్ర‌శ్నించారు. ఆఖ‌రుకు తన ఎంపీ స్టిక్కర్ ఉన్న కారుతో తన కుమార్తెను కూడా తిరగనివ్వనన్నారు. ఇటీవ‌ల త‌న ఎంపీ స్టిక్క‌ర్‌ను వేరే కారుకు వాడుకుని దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆయ‌న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల డీజీపీలు, లోక్‌స‌భకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ ఎంపీ స్టిక్క‌ర్ వాడుతోంది కేశినేని నాని సోద‌రుడు కేశినేని చిన్నినే అని వెల్ల‌డైంది.

గ‌త కొంత‌కాలంగా విజ‌య‌వాడ టీడీపీలో బుద్ధా వెంక‌న్న‌, నాగుల్ మీరాల‌తో కేశినేనికి అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఇవి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో కార్పొరేట‌ర్ల‌కు టిక్కెట్ల‌ప్పుడు కూడా ప్ర‌తిఫ‌లించాయి. విజ‌యవాడ న‌గ‌ర టీడీపీ మేయ‌ర్ అభ్య‌ర్థిగా కేశినేని నాని కుమార్తె శ్వేత వ‌ద్ద‌ని బుద్ధా వెంక‌న్న‌, నాగుల్ మీరా వ‌ర్గాలు వ్య‌తిరేకించాయ‌ని వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే నాని మేయ‌ర్ అభ్య‌ర్థిగా నాని త‌న కుమార్తెను ప్ర‌క‌టించేలా చేసుకున్నారు. అయితే కేశినేని నేని శ్వేత కార్పొరేట‌ర్‌గా గెలిచినా మేయ‌ర్ కాలేక‌పోయారు. వైఎస్సార్సీపీ మునిస‌ప‌ల్ కార్పొరేష‌న్ ను ఎగ‌రేసుకుపోయింది.

మ‌రోవైపు సంద‌ర్భం వ‌చ్చిన ప్ర‌తిసారీ కేశినేని నాని టీడీపీ అధిష్టానంపైన న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేస్తూ వ‌స్తున్నారు. ఇటీవ‌ల ఢిల్లీ వ‌చ్చిన చంద్ర‌బాబు నాయుడికి పుష్ప‌గుచ్ఛం కూడా ఇవ్వ‌డానికి ఇష్ట‌ప‌డ‌ని వైనం వైర‌ల్ గా మారింది. అంత‌కుముందు ఢిల్లీలో మీడియాతో ఆఫ్ ది రికార్డు మాట్లాడుతూ నాని చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం సృష్టించాయి.

త‌న‌కు పోటీగా త‌న సోద‌రుడు కేశినేని చిన్నిని టీడీపీ అధిష్టానం ప్రోత్స‌హిస్తోంద‌ని నాని భావిస్తున్నార‌ని అంటున్నారు. ఈ కార‌ణంతోనే టీడీపీ అధిష్టానంతో అంటీముట్ట‌న్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చెబుతున్నారు.

కాగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్ న్యూడ్ వీడియో ప్రైవేటు వ్య‌వ‌హారం కాద‌ని కేశినేని నాని తేల్చిచెప్పారు. రాజకీయ నాయకులు నిస్వార్థంగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. తాను ఏం మాట్లాడినా మీడియా త‌న మీద ఫోక‌స్ పెడుతుంద‌ని వాపోయారు.
Tags:    

Similar News