స్పీక‌ర్ ఛైర్ లో మ‌నోడు అదిరేశాడుగా!

Update: 2019-07-05 06:39 GMT
అరుదైన గుర్తింపును సొంతం చేసుకున్నారు క‌డ‌ప జిల్లా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. ఒక తెలుగోడు లోక్ స‌భ స్పీక‌ర్ కుర్చీలో ప్యాన‌ర్ స్పీక‌ర్ గా కూర్చోవ‌టం చాలా సంవ‌త్స‌రాల త‌ర్వాత తాజాగా చోటు చేసుకుంద‌ని చెప్పాలి.చిత్తూరు జిల్లాలో పుట్టి పెరిగిన మిథున్ రెడ్డి క‌డప జిల్లా రాజంపేట నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు.  మూడు రోజుల క్రితం ప్యానల్ స్పీక‌ర్ గా ఎంపికైన మిథున్ రెడ్డి.. లోక్ స‌భ‌ను నిర్వ‌హించే అవ‌కాశాన్ని సొంతం చేసుకున్నారు. ఏళ్ల త‌ర్వాత తెలుగు ఎంపీకి ద‌క్కిన అరుదైన అవ‌కాశంగా చెప్పాలి.

మ‌రో ఆస‌క్తిక‌క‌ర‌మైన విష‌యం ఏమంటే.. చిన్న వ‌య‌సులోనే ప్యాన‌ల్ స్పీక‌ర్ గా అవ‌కాశాన్ని సొంతం చేసుకోవ‌టం మిథున్ రెడ్డి సాధించిన ఘ‌న‌త‌గా చెప్ప‌క‌త‌ప్ప‌దు. మ‌రో కీల‌కాంశం ఏమంటే.. క‌డ‌ప జిల్లాకు చెందిన ఎంపీ ఒక‌రు ప్యాన‌ల్ స్పీక‌ర్ హోదాలో లోక్ స‌భ‌ను న‌డిపిన ఘ‌న‌త ఆరున్న‌ర ద‌శాబ్దాల త‌ర్వాత మిథున్ రెడ్డికే ద‌క్కిందని చెప్ప‌క త‌ప్ప‌దు.

అంతేకాదు.. ఒక తెలుగు ఎంపీకి లోక్ స‌భ స్పీక‌ర్ ఛైర్లో కూర్చునే అవ‌కాశం చాలా ఏళ్ల త‌ర్వాత ఆయ‌న సొంతం చేసుకున్నారు. స్పీక‌ర్.. డిప్యూటీ స్పీక‌ర్ లేని వేళ‌లో ప్యాన‌ల్ స్పీక‌ర్ స‌భ‌ను నిర్వ‌హించాల్సి ఉంటుంది. తాజా మోడీ ప్ర‌భుత్వంలో ఇప్ప‌టివ‌ర‌కూ డిప్యూటీ స్పీక‌ర్ ను ఎంపిక చేయ‌ని విష‌యం తెలిసిందే. దీంతో.. మూడు రోజుల క్రితం ప్యాన‌ల్ స్పీక‌ర్ గా ఎంపికైన మిథున్ రెడ్డికి స‌భ‌ను నిర్వ‌హించే అవ‌కాశం ల‌భించింది. గురువారం మ‌ధ్యాహ్నం స్పీక‌ర్ ఓం బిర్లా హాజ‌రుకాలేదు. దీంతో.. ప్యాన‌ల్ స్పీక‌ర్ గా నియ‌మితులైన మిథున్ రెడ్డికి స‌భ‌ను న‌డిపించే అవ‌కాశం ల‌భించింది.

ఆధార్ స‌వ‌ర‌ణ బిల్లుపై జ‌రిగిన చ‌ర్చ సంద‌ర్భంగా స్పీక‌ర్ ఛైర్ లో కూర్చున్న మిథున్ రెడ్డి.. ఇంగ్లిష్.. హిందీలో మాట్లాడుతూ స‌భ‌ను నిర్వ‌హించారు. 1952లో ఏర్ప‌డిన తొలి లోక్ స‌భ‌లో క‌డ‌ప‌జిల్లాకు చెందిన మాడ‌భూషి అనంత‌శ‌య‌నం అయ్యంగార్ డిప్యూటీ స్పీక‌ర్ గా ఎన్నిక‌య్యారు. ఆ త‌ర్వాత కాలంలో తెలుగోడు నీలం సంజీవరెడ్డి రెండు ప‌ర్యాయాలు లోక్ స‌భ స్పీక‌ర్ కుర్చీలో కూర్చునే అవ‌కాశాన్ని ద‌క్కించుకోగా.. త‌ర్వాత జీఎంసీ బాల‌యోగి (1998-2002) తెలుగు ప్రాంతానికి చెందిన వ్య‌క్తి స్పీక‌ర్ కుర్చీలో కూర్చున్నారు. ఆయ‌న త‌ర్వాత మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు స్పీక‌ర్ కుర్చీలో కూర్చునే అవ‌కాశం ద‌క్కిన తెలుగోడు మిథున్ రెడ్డే.
Tags:    

Similar News