ఎంపీ నస్రత్ జహాన్ అనర్హురాలు.. స్పీకర్ కు బీజేపీ ఎంపీ లేఖ

Update: 2021-06-24 07:19 GMT
నటులు రాజకీయాల్లోకి వస్తే తమ పాత వాసనలు ఎప్పటికీ వీడరు. రాజకీయాల్లోనూ సినిమాల్లో ఉన్నట్టే ప్రవర్తిస్తారు. అయితే అదే వారిని చిక్కుల్లో పడేస్తుంది. ఇప్పుడూ అదే జరిగింది. భారతీయ సంస్కృతిని అవమానించారంటూ  తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నస్రత్ జహాన్ పై తాజాగా బీజేపీ ఎంపీ ఆరోపణలు గుప్పించారు. వెంటనే ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ తాజాగా ఎంపీ నస్రత్ జహాన్ పై మండిపడ్డారు. నుదుటన సింధూరం పెట్టుకున్న నస్రత్ ఓ వ్యక్తిని వివాహం చేసుకొని తన భర్తగా పేర్కొంటూ వివాహ విందును ఏర్పాటు చేశారని.. దానికి సీఎం మమతను కూడా ఆహ్వానించారని గుర్తు చేశారు. ఇప్పుడేమో అతడితో తనకు పెళ్లే జరగలేదని చెబుతున్నారని.. ఇది భారతీయ సంస్కృతిని అవమానించడమేనని అన్నారు.

నస్రత్ తన పదవికి రాజీనామా చేయకుంటే పదవి నుంచి తొలగించాలని బెంగాల్ బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు నస్రత్ జహాన్ వివాదాన్ని రాజకీయంగా దుమారం రేపుతోంది.

ఇక యూపీ బీజేపీ ఎంపీ సంఘమిత్ర మౌర్య కూడా ఈ వివాదంపై మండిపడ్డారు. ఎంపీ నస్రత్ తన వైవాహిక హోదా గురించి పార్లమెంట్ కు తప్పుడు ప్రమాణపత్రాన్ని సమర్పించారని.. ఆమెకు ఈ పదవికి అనర్హురాలు అని డిమాండ్ చేశారు.

వ్యాపారవేత్త నిఖిల్ జైన్ ను టర్కీలో వివాహం చేసుకున్నట్టు గతంలో ప్రకటించిన నస్రత్.. ఇటీవల తమ బంధం దెబ్బతిన్నట్టు ప్రకటించినప్పటి నుంచి రాజకీయంగా వివాదం చుట్టుముట్టింది. నుస్రత్ జహాన్ జూన్ 9న తన వివాహ బంధం దెబ్బతిందని ప్రకటించింది. టర్కీష్ నిబంధనల ప్రకారం చేసుకున్నామని.. అది భారతదేశంలో చెల్లుబాటు కాదని తెలిపింది.

ఇక నిఖిల్ జైన్ ను పెళ్లి చేసుకున్న నస్రత్ కోల్ కతాలో భారీ విందు కూడా ఇచ్చారు. దీనికి సీఎం మమతా బెనర్జీ కూడా హాజరయ్యారు. ఇప్పుడు తన పెళ్లిపై మాట మారుస్తున్న నస్రత్ తీరు వివాదాస్పదమవుతోంది.
Tags:    

Similar News