ఇదేం పోయే కాలం? హెడ్ నర్సుతో అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీ పీఏ

Update: 2023-02-17 10:47 GMT
ఆంధ్రప్రదేశ్ కు చెందిన అధికార పార్టీ ఎంపీ పీఏ ఒకరు చేసిన ఆరాచకం తాజాగా వెలుగు చూసింది. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్న హెడ్ నర్సు చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించటంతో హడలి పోయిన ఆమె భయంతో బలంగా చేయి వదిలించుకొని పరుగులు పెట్టిన వైనం షాకింగ్ గా మారింది.

తన నీచబుద్దిని ప్రదర్శించిన సదరు ఎంపీ పీఏ తీరును అందరూ తప్పు పడుతున్నారు. ఇప్పడున్న సమస్యలు సరిపోనట్లుగా.. అధికార పార్టీకి చెందిన ఎంపీ పీఏ తీరు జగన్ సర్కారుపై వేలెత్తి చూపేందుకు అవకాశం ఇచ్చిందని చెప్పాలి.

అసలేం జరిగిందంటే.. రెండు రోజుల క్రితం చిత్తూరు జిల్లాలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రికి ఫోన్ చేసిన ఎంపీ పీఏ ఒకరు.. తమ బంధువులు ప్రసూతి సేవల కోసం ఆసుపత్రికి వస్తున్నారని.. జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

ఎంపీ పీఏ కావటంతో.. అధికారులు మరింత శ్రద్ధతో వైద్య సేవల్ని అందించారు. ఇదిలా ఉండగా.. బుధవారం రాత్రి తమ బంధువుల్ని చూసేందుకు వచ్చిన సదరు ఎంపీ పీఏ.. వార్డులో ఉన్న హెడ్ నర్స్ చేయిపట్టుకొని అభ్యంతరకరంగా వ్యవహరించటం షాకింగ్ గా మారింది.

ఊహించని పరిణామంతో బెదిరిపోయిన సదరు హెడ్ నర్స్ ఒక్కసారిగా చేయి విదిలించుకొని భయంతో పరుగులు పెట్టేసింది. అనంతరం సహచర నర్స్ లతో కలిసి డీసీహెచ్ ఏఎస్ నాయక్ కు ఫిర్యాదు చేసింది.

అయితే.. సదరు పీఏ ఎంపీకి సన్నిహితుడు కావటంతో ఈ వ్యవహారంపై కఠినంగా వ్యవహరించేందుకు వెనకాడుతున్నట్లుగా చెబుతున్నారు. ఎంపీ పీఏ బలుపు చేష్టపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News