రాజు గారి రాక ఎప్పుడా అని....

Update: 2020-09-17 10:30 GMT
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. వైసిపి తరపున మొన్నటి ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం నుండి కనుమూరు రఘురామ కృష్ణంరాజు గెలిచిన విషయం తెలిసిందే. గెలిచిన దగ్గర నుండి పార్టీలైనును కాదని సొంతంగా మరో లైనును ఎంపి ఏర్పాటు చేసుకున్నాడు. పార్టీతో సంబంధం లేకుండానే సొంత అజెండాతో  ఢిల్లీ వ్యవహరిస్తున్నాడు. దాంతో ఇదే విషయమై పార్టీకి ఎంపికి గ్యాప్ మొదలైంది. పార్టీలైన్ లోకి మారమని  నాయకత్వం హెచ్చరించినా ఎంపి  పట్టించుకోలేదు. దాంతో గ్యాప్ కాస్త ఎక్కువైపోయింది. దీన్ని అవకాశంగా తీసుకున్న కృష్ణంరాజు నేరుగా జగన్మోహన్ రెడ్డిపైనే నోటికొచ్చినట్లు ఆరోపణలు, ప్రభుత్వంపై విమర్శలు మొదలుపెట్టారు.

దాంతో పార్లమెంటు పరిధిలోని ఎంఎల్ఏలు, నేతలతో సంబంధాలు పూర్తిగా చెడిపోయింది. దాంతో ఒకళ్ళపై మరకొళ్ళు ఫిర్యాదులు చేసుకునేదాక వ్యవహారం చెడిపోయింది. దాంతో తనపై ఎవరైనా దాడులు చేస్తారని భయపడ్డారో ఏమో నియోజకవర్గానికి రావటం దాదాపు తగ్గించేశారు. ఉంటే హైదరాబాద్ లేకపోతే ఢిల్లీ అన్నట్లుగా తయారైంది ఎంపి వ్యవహారం. తనను వ్యక్తిగతంగా దూషించారని, దిష్టిబొమ్మలు తగలబెట్టారంటూ ఎంపి కొందరు ఎంఎల్ఏలు, నేతలపై నరసాపురంతో పాటు పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ దగ్గర ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో ఎంపి మీద ఎంఎల్ఏలు, నేతలు ఎదురుకేసులు పెట్టారు. దాంతో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తు తనను అరెస్టు చేస్తారని, తనకు భద్రత లేదంటూ స్పీకర్ కు ఫిర్యాదు చేసి కేంద్రభద్రతను తెచ్చుకున్నారు.

ఈ గోల ఇలాగుండగానే ఎంపి ఉద్దేశ్యపూర్వకంగానే కొన్ని మీడియాలకు బాగా దగ్గరయ్యారు. వాటితో సమావేశమవుతు జగన్ ప్రభుత్వంపై తరచు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని జగన్ కు లేదా మతానికి ముడేయటం మొదలుపెట్టారు. అంటే జగన్ క్రిస్తియన్ అని జనాల్లోకి ఎక్కించేందుకు ఎంపి తెగ ప్రయత్నిస్తున్న విషయం అందరికీ అర్ధమైపోయింది.

ఎంపిపై అనర్హత వేటు వేయాలంటూ పార్టీ కూడా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసింది. సరే ఆ ఫిర్యాదు ఇపుడు స్పీకర్ దగ్గర పెండింగ్ లో ఉంది లేండి. స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటాడో ? ఎప్పుడు అనర్హత వేటు వేస్తాడో సస్పెన్సుగా మారిపోయింది.

ఇదంతా ఒకవైపు నడుస్తున్నా చాలా రోజులుగా ఎంపి ఢిల్లీలోనే మకాం పెట్టేశారు. తన నియోజకవర్గాన్ని, రాష్ట్రాన్ని వదిలేసినట్లే అనుమానంగా ఉంది. నియోజకవర్గంలోకి వచ్చి ఏమి చేయాలో ఎంపికి అర్ధం కావటం లేదు.  భద్రత కోసం కేంద్రబలగాలనైతే తెచ్చుకున్నారు కానీ జనాలను ఎక్కడి నుండి తెచ్చుకుంటారు ? ఎక్కడ తిరిగినా ఏమి చేసినా చివరకు రావాల్సింది నరసాపురంకే కదా. ఇక్కడే ఎంపికి సమస్యలు మొదలవుతున్నాయి. నియోజకవర్గానికి స్వేచ్చగా రాలేరు, అలాగని ఎల్లకాలం ఢిల్లీలోనే గడపలేరు.రాజధాని ప్రాంతంలోని రైతులతో మాట్లాడినా, మీడియాతో మాట్లాడినా అన్నీ ఢిల్లీ నుండే. మొత్తానికి ఎంపి పరిస్ధితి కూడా ప్రవాసాంధ్రుడిలాగ తయారైపోయిందని నియోజకవర్గంలో సెటైర్లు పేలుతున్నాయి. చూడాలి ఎంతకాలం ఎంపి ఇలా మ్యానేజ్ చేస్తారో ?
Tags:    

Similar News