షాకిచ్చే ప్రకటన చేసిన ఎంపీ రఘురామ

Update: 2022-01-07 10:57 GMT
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ.. తన మాటలతో సొంత పార్టీ నేతలకు బీపీ పెంచే నేతగా సుపరిచితుడు ఏపీ అధికార పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన ప్రకటన చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. త్వరలోనే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రఘురామ.. తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పి.. సంచలనంగా మారారు. తనపై అనర్హత వేటు వేయించటానికి మరెంత సమయం కావాలో చెప్పాలని ఒకింత సవాల్ విసిరిన ఆయన.. ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఏపీ రాజధాని అమరావతి ఎజెండాతో మళ్లీ ఎన్నికలకు వెళతానని చెప్పారు.

తన రాజీనామాతో జరిగే ఉప ఎన్నికల్లో ఏపీ ప్రజలు జగన్ పాలనను ఎంతలా అసహ్యించుకుంటున్నారన్న విషయాన్ని తన గెలుపుతో నిరుస్తానని చెబుతున్నారు. ఏపీ మంత్రి తాజాగా మాట్లాడుతూ.. కొన్ని పత్రికలు.. చానల్స్ ను బ్యాన్ చేస్తున్నట్లుగా ప్రకటించిన వైనాన్ని తీవ్రంగా ఖండించారు.

రఘురామ కీలక ప్రకటన ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. తాను ప్రాతినిధ్యం చేస్తున్న పార్టీన అధినేతపైనా.. ఆయన పాలన పైనా..మంత్రులపైనా తరచూ షాకింగ్ వ్యాఖ్యలు చేస్తూ ఉండే ఆయనపై చర్యలు తీసుకోవాలని.. అనర్హత వేటు వేయాలని ప్రయత్నించారు. కానీ.. అదేమీ ఇప్పటివరకు ఫలించలేదు. ఇలాంటి వేళ.. రఘురామ తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరి.. రఘురామ తన రాజీనామా తర్వాత.. ఏ పార్టీలో చేరతారు? ఉప ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారు? లాంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తేలా ఆయన ప్రకటన ఉంది. కొన్ని వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆయన.. బీజేపీలో చేరతారన్న ప్రచారం బలంగా సాగుతోంది. రఘురామ రాజీనామా ప్రకటనపై ఏపీ అధికారపార్టీకి చెందిన నేతలు మరెలా రియాక్టు అవుతారో చూడాలి.
Tags:    

Similar News