కేటీఆర్‌ కు 111 జీవో చెల్లదా? రేవంత్ రెడ్డి ఆగ్రహం - అరెస్ట్

Update: 2020-03-02 15:16 GMT
రంగారెడ్డి జిల్లా జన్వాడలో మంత్రి కేటీ రామారావు అక్రమంగా ఫాంహౌస్ నిర్మించారని ఆరోపిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేత - మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సోమవారం ముట్టడికి ప్రయత్నించారు. దీంతో జన్వాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వ జీవోను పక్కన పెట్టే కేటీఆర్ అక్కడ ఫాంహౌస్ నిర్మించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాలను అతిక్రమిస్తూ కేసీఆర్ - ఆయన తనయుడు కేటీఆర్ దర్జాగా గడుపుతున్నారన్నారు.

నిబంధనలకు నీళ్లొదిలి 25 ఎకరాల్లో ఫామ్ హౌస్ నిర్మించారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 111ని అతిక్రమించారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనలను నిబంధనలను కేసీఆర్ - కేటీఆర్ అతిక్రమించడం దారుణమని వ్యాఖ్యానించారు. గండిపేట చెరువుకు వెళ్లే దారిలో కేటీఆర్ నిర్మించుకున్న విలాసవంతమైన ఫాంహౌస్ ప్రాంతం 111 జీవో పరిధిలోకి వస్తుందన్నారు.

రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి - కాంగ్రెస్ నాయకులు - కార్యకర్తలు ఫాంహౌస్ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులకు - రేవంత్ రెడ్డికి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసులు రేవంత్ రెడ్డిని - విశ్వేశ్వర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

కాగా, రేవంత్ రెడ్డి ఫాంహౌస్ ముట్టడి ప్రయత్నంపై తెరాస నేతలు మండిపడ్డారు. కేటీఆర్ ఫాంహౌస్ అక్రమంగా నిర్మించారని - దానిని బయటపెడతానని వెళ్లిన ఆయన కొండను తవ్వే ప్రయత్నంలో వెంట్రుక కూడా పట్టలేదని బాల్క సుమన్ అన్నారు. ఆయనే గోపన్‌పల్లిలోని స్థలం కబ్జా చేసి పేద ప్రజల పొట్ట కొట్టే ప్రయత్నం చేశాడన్నారు. తనలాగా అందరూ తప్పులు చేస్తాడని భావిస్తున్నట్లుగా ఉందన్నారు. తెరాసలో నిఖార్సయిన ఉద్యమకారులు ఉంటారన్నారు.
Tags:    

Similar News