చంద్రబాబుపై ధిక్కారం మొదలైనట్లేనా...?

Update: 2017-04-15 10:04 GMT
ఏపీ సీఎం చంద్రబాబు ఏ ముహూర్తాన తన మంత్రివర్గాన్ని విస్తరించారో కానీ ఎన్నడూ లేనట్లుగా టీడీపీకి హాల్ మార్క్ లాంటి క్రమశిక్షణ కట్టు తప్పిపోయింది.  విస్తరణలో పదవులు పోయినవారు - పదవులు వస్తాయని ఆశించి నిరాశ చెందినవారు... తమకు దక్కకపోగా తమ ప్రత్యర్థులకు పదవులు దక్కినవారు ఇలా.. చాలామంది చంద్రబాబుపై తిరుగుబాటు చేసినంత పనిచేశారు. రాజీనామాలు చేశారు.. హెచ్చరికలు చేశారు. మెల్లమెల్లగా అంతా సెట్ రైట్ చేశారు చంద్రబాబు. కానీ, ఇంతలోనే సొంత జిల్లాకు చెందిన ఎంపీ శివప్రసాద్ నుంచి ఈసారి నిరసన గళం మొదలైంది. ఆయన వ్యక్తిగత అంశాలు కాకుండా ఏకంగా దళిత ప్రజలకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలంటూ నిలదీస్తుండడంతో చంద్రబాబు ఇరకాటంలో పడ్డారు.
    
తెలుగుదేశం ఎంపీ శివప్రసాద్ పార్టీపై ధిక్కార స్వరం పెంచారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా నిన్న ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన తెలుగుదేశం ప్రభుత్వం దళితులను విస్మరిస్తున్నదంటూ విమర్శించిన సంగతి తెలిసిందే. దళితులను విస్మరిస్తే సహించబోనంటూ నిరసన గళం వినిపించిన ఆయన ఈ రోజు కూడా అదే వైఖరిని కొనసాగించారు. శివప్రసాద్ నిన్న చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ముఖ్య నేతలతో టెలీకాన్ఫరెన్స్ లో ఆగ్రహం వ్యక్తం చేసి సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కూడా ఎంపీ శివప్రసాద్ వైఖరిలో మార్పు రాలేదు.  ఈ రోజు  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూడా ఆయన అదే ధిక్కార ధోరణిని వ్యక్తం చేశారు. దళితులను విస్మరిస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఉన్న మాటే మాట్లాడాననీ, తప్పేం చేయలేదని అన్నారు.
    
అంతేకాదు... ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంపీలకు సమయం ఇవ్వడం లేదనీ, వారి అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకోవడం లేదనీ ఆరోపించారు. చంద్రబాబును ఏపీలో కలవలేకపోతున్నామని.. ఢిల్లీ వచ్చినా కలవలేకపోతున్నామని అన్నారు. తాను ఏ తప్పూ చేయలేదనీ, ఓపెన్ గా ఉన్నదున్నట్లు మాట్లాడానని అన్నారు. కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చంద్రబాబుకు స్టీరింగ్ పై కంట్రోల్ తప్పుతున్నట్లుగా కనిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News