చిత్తూరు ఎంపీ సీఎం అయ్యారు

Update: 2016-01-11 07:28 GMT
చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ ముఖ్యమంత్రయ్యారు... అయితే... ఎందుకోగానీ ఆయన ఈ సంగతి ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రం చెప్పొందంటున్నారు. ఆశ్చర్యంగా ఉందా?... కన్ఫ్యూజింగ్ గా ఉందా..? ఏం లేదండీ.. ఎంపీ శివప్రసాద్ మంచి నటుడన్న సంగతి తెలుసుకదా. ఆయన పార్లమెంటు వద్ద కూడా ఎన్నో వేషాలు వేశారు, సినిమాల్లోనూ ఎన్నో పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ సీఎం కావడం కూడా నటనలో భాగమే. అయితే.. సినిమాల్లోనో, సీరియళ్లలోనో కాదు.. జన్మభూమి సభలో ఆయన సీఎం వేషం వేయడంతో అందరినీ ఆకట్టుకుంది.
   
కుప్పంలో నిర్వహించిన జన్మభూమి గ్రామసభలో ఆయన ముఖ్యమంత్రిలా హావభావాలు ప్రదర్శించారు. జన్మభూమి సభా వేదికమీద ఈ చివరినుంచీ ఆ చివరి వరకూ నడుస్తూ చేయి ఎత్తి రెండు వేళ్లతో విజయచిహ్నం చూపుతూ.. ప్రజలకు అభివాదం చేశారు. ఆపై తాను సీఎం అయిన రహస్యం ఎక్కడా చెప్పవద్దని ప్రజలతో సరదాగా అన్నారు.
   
కుప్పం సర్పంచి డాక్టర్‌ వెంకటేశ్‌ ఈ స్కిట్ ను రాశారు... దాన్ని ఎంపీకి ఇచ్చి నటించమని కోరగా ఆయన అంగీకరించి సీఎంగా నటించి అందరినీ అలరించారు. 1995కు ముందు ప్రజా సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం, వారిచ్చిన అర్జీలకు పడుతున్న గతిని, ఆపైన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ప్రజల వద్దకు పాలన, జన్మభూమి గ్రామ సభలలో ప్రజలవద్దకే అధికారులు తరలివచ్చి సమస్యల పరిష్కారం చూపిస్తున్న విధానాన్ని ఈ స్కిట్‌లో వివరించారు. ఇందులో ముఖ్యమంత్రిగా శివప్రసాద్ నటనకు జనం చప్పట్లు కొట్టారు.  చంద్రబాబు తరహాలో విజయ చిహ్నం చూపిస్తూ ప్రజలకు అభివాదం చేశారు.
Tags:    

Similar News