సుజ‌నా చౌద‌రి మాట త‌ప్ప‌లేదు తెలుసా?!

Update: 2016-08-30 15:37 GMT
కేంద్ర మంత్రి సుజనా చౌదరి మ‌రోమారు త‌న పాత మాట‌కే క‌ట్టుబ‌డ్డారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ప్ర‌త్యేక హోదా అంశం అంటే తెర‌మీద‌కు వచ్చే సుజ‌నా చౌద‌రి తాజాగా సానుకూల‌మైన సంద‌ర్భం రావ‌డంతో ఢిల్లీ వేదిక‌గా మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాలపై ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నివాసంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు అరుణ్‌ జైట్లీ - వెంకయ్య నాయుడు - సుజనాచౌదరి పాల్గొన్నారు. దాదాపు గంటన్నరపాటు సమావేశం కొనసాగిన అనంత‌రం సుజ‌నా చౌద‌రి మీడియాతో మాట్లాడారు.

ఆర్థిక మంత్రితో జ‌రిగిన స‌మావేశంలో విభజన చట్టం అమలు - ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై విస్తృతంగా చర్చించిన‌ట్లు సుజ‌నా చౌద‌రి తెలిపారు. అలాగే  ఏపీకి ప్ర‌త్యేక రైల్వే జోన్‌ - ప్రత్యేక హోదా - పోలవరం ప్రాజెక్టుపై సమావేశంలో చర్చ సాగిందని వివ‌రించారు. ప్రత్యేక హోదా - ప్యాకేజీపై కేంద్రం ఒక ముసాయిదా తయారుచేస్తోందని సుజ‌నా పున‌రుద్ఘాటించారు. వీట‌న్నింటిపై త్వరలో ఒక నిర్ణయం వెలువడవచ్చని సుజ‌నా వ్యాఖ్యానించారు. రెండ్రోజులుగా సీఎం చంద్రబాబు నాయుడు ప్ర‌త్యేక హోదా గురించి త‌మ‌కు ఆదేశాలు ఇస్తున్నారని ఈ క్ర‌మంలోముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆర్థిక మంత్రి - ఇతర నేతలతో చర్చ జరిపానని సుజ‌నా చౌద‌రి వివరించారు.

ఆర్థిక మంత్రితో జ‌రిగిన స‌మావేశంలో ఏపీ గురించిన అన్ని వివ‌రాలు ఆస‌క్తిగా అడిగి తెలుసుకోవ‌డాన్ని బ‌ట్టి ఏపీకి పెద్ద ఎత్తున న్యాయం జ‌రుగుతుంద‌ని ఆకాంక్షిస్తున్న‌ట్లు సుజ‌నా చౌద‌రి భ‌రోసా వ్య‌క్తం చేశారు. ఏపీకి ఇప్ప‌టివ‌ర‌కు చేసిన ఆర్థిక స‌హాయం, ఆయా ప‌థ‌కాల వివ‌రాలు తాము స్ప‌ష్టంగా వివ‌రించామ‌ని పేర్కొంటూ ఆర్థిక మంత్రి సావ‌ధానంగా విన‌డాన్ని బ‌ట్టి శుభ‌వార్త వ‌స్తుంద‌ని భావిస్తున్న‌ట్లు సుజనా తెలిపారు.
Tags:    

Similar News