జగన్ ఓకే : అనకాపల్లి రేసులో ఆమె...?

Update: 2022-08-07 02:30 GMT
వచ్చే ఎన్నికల్లో టికెట్ల కోసం అధికార పార్టీలో హడావుడి మొదలైంది. అధినేత జగన్ సైతం టికెట్ల గురించే ప్రస్తావిస్తూ పార్టీ మీటింగ్స్ పెడుతూండడంతో సిట్టింగులతో పాటు ఆశావహులు కూడా రంగంలో  దూకుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ సీటు విషయంలో ఇపుడు పోటీ పెరుగొతోంది. ఈ సీటుకు ఎంతో రాజకీయ ప్రాముఖ్యత ఉంది. విశాఖ ఏకైక జిల్లాగా ఉన్న రోజుల నుంచి నేటి దాకా అనకాపల్లి అసలైన రాజెకీయ జిల్లాగా ఉంటూ వచ్చింది. ఇక్కడ ఎంపీ సీటుకు యోధానుయోధులు పోటీ పడి గెలిచారు, ఓడారు. అందుకే ఈ సీటుకు ఉన్న మోజు క్రేజ్ అలాంటివి అని చెప్పాలి.

ఇదిలా ఉంటే 2019 ఎన్నికల్లో అనకాపల్లి సీటు నుంచి వైసీపీ తరఫున చివరి నిముషంలో డాక్టర్ భీశెట్టి సత్యవతి పేరుని ఎంపిక చేశారు. ఆమె పెద్దగా ఎవరికీ తెలియదు అని అంటారు. ఆమె కాంగ్రెస్ లో ఒక మాదిరి నాయకురాలిగా ఉంటూ వచ్చారు. అలాంటి ఆమెను ఎంపీగా పోటీ చేయించడం అంటే ఓడే సీటేనని అనుకున్నారు. కానీ ఆమె జగన్ వేవ్ లో అనూహ్యంగా గెలిచారు. ఇక మూడేళ్ళు పైదాటిన తరువాత ఆమె పనితీరు మీద వైసీపీకి అందుతున్న నివేదికలు చూస్తే పేలవంగా ఆమె రాజకీయ ప్రదర్శన ఉందని అంటున్నారు.

దాంతో ఇక్కడ కచ్చితంగా క్యాండిడేట్ ని మారుస్తారు అని కూడా చెబుతున్నారు. ఈ సీటు కోసం ఇప్పటికే కర్చీఫ్ వేశారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఒకనాటి అనుచరుడు, ప్రస్తుత వైసీపీ నేత కాశీ విశ్వనాధం. ఆయనకు అనకాపల్లి అసెంబ్లీ అయినా పార్లమెంట్ అయినా కావాలని అనుచరులు చెబుతున్నారు. దాంతో ఆయన్ని అసెంబ్లీకి పంపిస్తే పార్లమెంట్ కి గట్టి క్యాండిడేట్ కావాలి.

దాంతో ఈ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ, బలమైన సామాజికవర్గానికి చెందిన వరుడు కళ్యాణికి ఎంపీ టికెట్ ఇవ్వవచ్చు అని అంటున్నారు. జగన్ సైతం ఆమె పట్ల ప్రత్యేకమైన అభిమానాన్ని చూపుతారు. జగన్ విశాఖ టూర్లో ఎపుడూ ఆమెతో బాగా మాట్లాడుతారు. ఇటీవల ఆయన విశాఖ టూర్ లో కళ్యాణి తో కొంతసేపు విడిగా సంభాషించారు కూడా. ఆమెను గట్టిగా ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి ఎంపీ టికెట్ ఇవ్వడం ద్వారా జాతీయ స్థాయిలో  మరింతగా ఆమె సేవలను వాడుకోవాలనుకుంటున్నారు అని చెబుతున్నారు.

ఇక ఆమె కూడా అనకాపల్లి ప్రాంతంలో తమ పట్టుని పెంచుకుంటున్నారు. మరి హై కమాండ్ నుంచి వచ్చిన ఆదేశాలో లేక సూచనలో తెలియదు కానీ కళ్యాణి దూకుడుగానే ఉన్నారు. సామాజిక సమీకరణలతో పాటు రాజకీయ లెక్కలు కూడా సరిపోతే ఆమె ఎంపీ అభ్యర్ధి అని వైసీపీలో గట్టిగా వినిపిస్తోంది. అంటే ఒక మహిళకు ఇచ్చిన సీటుని మరో మహిళల్తోనే భర్తీ చేస్తారు అని అంటున్నారు. మొత్తానికి జగన్ దృష్టిలో పడిన వరుడు కళ్యాణి ముందు ఎమ్మెల్సీ అయింది రేపు జగన్ తో పాటు జనాల దయ ఉంటే కచ్చితంగా ఎంపీ అయి పార్లమెంట్ కి వెళ్తుంది అని ఆమె అనుచరులు ధీమాగా ఉన్నారు.
Tags:    

Similar News