ఫిరాయింపుల్ని టీఆర్ ఎస్ ఎంపీ ఎంతచక్కగా చెప్పారో?

Update: 2016-05-03 04:45 GMT
చేసేది తప్పు అయినా సరే.. తప్పు పట్టకుండా వ్యవహరించటం.. తమను తాము సమర్థించుకోవటం.. అందుకు లాజిక్ గా వాదన వినిపించటం లాంటి కళలు టీఆర్ ఎస్ నేతల్లో పుష్కలంగా కనిపిస్తాయి. మిగిలిన పార్టీల్లో ఇలాంటి కళ ప్రదర్శించినా.. ఒకరిద్దరు నేతలకు మించి ఎక్కువ మంది ఇలా వ్యవహరించలేరు. కానీ.. తెలంగాణ అధికారపక్షం ఇందుకు భిన్నం.

ఆ పార్టీలో అధినేత.. ఆయన కుటుంబం మొదలు.. పలువురు నేతలు ఇదే తీరులో మాట్లాడతారు. టీఆర్ ఎస్ అధినేత.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ ను షురూ చేయటం.. అందులో భాగంగా తెలంగాణలో తనకు కంట్లో నలుసులా ఉన్నటీడీపీని ఒక కొలిక్కి తీసుకురావటమే కాదు.. ఇప్పుడా పార్టీ తెలంగాణలో చప్పుడు చేయకుండా ఉండటంలో ఎంతలా సక్సెస్ అయ్యారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

తాజాగా.. తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కమ్ ఎంపీ పొంగులేటితో పాటు..మరో ఎమ్మెల్యే సోమవారం కారెక్కిన సంగతి తెలిసిందే. తాజా జంపింగ్స్ గురించి ప్రస్తావిస్తూ.. టీఆర్ ఎస్ సీనియర్ నేత.. ఎంపీ వినోద్ చెప్పిన మాటల్ని వింటే ముచ్చటేయక మానదు. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి జంప్ అయిన నేతల్ని ఆయన భలే కవర్ చేశారు. ప్రస్తుతం తెలంగానలో జరుగుతున్నది ఫిరాయింపులు కాదని.. కేవలం రాజకీయ పునరేకీకరణ మాత్రమేనని చెప్పుకొచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని పార్టీల నేతలు తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాయని చెప్పిన వినోద్.. తెలంగాణ అభివృద్ధి కోసం.. బంగారు తెలంగాణ కోసం వచ్చే వారిని తాము ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. చేసే పని మీద నలుగురు ఏం అనుకుంటారన్న విషయాన్ని పక్కన పెడితే.. టీఆర్ ఎస్ నేతలు ఎంత బాగా కవర్ చేస్తారన్నది ఎంపీ వినోద్ మాటలు అర్థమయ్యేలా చేస్తాయని చెప్పక తప్పదు.
Tags:    

Similar News