అక్కడ కూడా రాజధాని రేంజ్‌లో ప్యాకేజీ అంట

Update: 2015-04-12 06:03 GMT
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చంద్రబాబు సర్కారుకు కొత్త ఇబ్బంది మొదలైంది. ప్రాంతం ఏదైనా కానీ.. అభివృద్ధికి సంబంధించి పెద్ద నిర్ణయాన్ని ప్రకటిస్తే.. అక్కడి స్థానికులు చేస్తున్న డిమాండ్లు కళ్లు తిరిగేలా చేస్తున్నాయి. విజయనగరం జిల్లా రూపురేఖల్ని సమూలంగా మార్చివేసే.. గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయానికి సంబంధించి అక్కడి స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేయటం తెలిసిందే.

ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి వందలాది ఎకరాల్ని సేకరించేందుకు ప్రభుత్వం ఒకపక్క సన్నాహాలు చేస్తుంటే.. అందుకు భిన్నంగా అక్కడి ప్రజలు మాత్రం ఓ పాతిక ఎకరాల్లో ఎయిర్‌పోర్ట్‌ కట్టుకోండన్నట్లుగా మాట్లాడటం తెలిసిందే. అభివృద్ధి కార్యక్రమాల విషయంలో తమ వ్యక్తిగత ప్రయోజనాలకే పెద్దపీట వేసుకుంటున్న ప్రజల్ని ఒప్పించి.. ప్రాజెక్టు దిశగా అడుగులు వేయించటం ఏపీ సర్కారుకు తలకు మించిన భారంగా మారుతోంది.

ఏపీ రాష్ట్ర రాజధాని విషయంలో దేశంలోనే మరే ప్రభుత్వం ఇవ్వలేనంత భారీ ప్యాకేజీని ఇచ్చిన తర్వాత కూడా కోర్టు.. ధర్నాలు.. రాస్తారోకోలు లాంటివి ఫేస్‌ చేయాల్సి వచ్చింది. తాజాగా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించి ఇదే పరిస్థితి నెలకొంది.

తమ భూములు తీసుకునేటట్లయితే ఎయిర్‌పోర్ట్‌ రాకున్నా నష్టమేమీ లేదనే వరకూ వ్యవహారం వెళుతోంది. మరోవైపు.. భోగాపురంలో ఏదోలా ఎయిర్‌పోర్ట్‌ నిర్మించాలన్నది ఏపీ అధికారపక్ష ఆలోచన. అందుకేనే.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి అవసరమైన భూమిని సేకరించేందుకు అక్కడి భూ యజమానులకు ఏపీ మంత్రి మృణాళిని భారీ బిస్కెట్‌ను వేసేశారు.

ఏపీ రాజధాని తరహా ప్యాకేజీని అమలు చేయాలని తాము అనుకుంటున్నట్లుగా తన మనసులోని మాటను చెప్పారు. భోగాపురంలో నిర్మించదలుచుకున్న ఎయిర్‌పోర్ట్‌కి అవసరమైన భూసేకరణ కోసం ఏపీ రాజధాని తరహా ప్యాకేజీ ఇవ్వాలనుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. ఇలా భూమి అవసరమైన ప్రతి విషయానికి రాజధానికి అమలు చేసిన ప్యాకేజ్‌ అంటే సర్కారు మీద భారం పెంచుకుంటూ పోతున్నట్లు కాదా?అన్నది ఇప్పుడు సందేహాంగా మారుతోంది.



Tags:    

Similar News