ఆర్యవైశ్యులంటే ఆకాశవాణికి అంత అలుసా?

Update: 2015-09-30 04:29 GMT
కొత్త వివాదం తెరపైకి వచ్చింది. దీనికి ఆలిండియా రేడియో కారణం కావటం గమనార్హం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆర్యవైశ్యుల్ని అవమానించారంటూ ఆ వర్గం వారు విపరీతమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే దేశ వ్యాప్తంగా ఉన్న ఆకాశవాణి  కేంద్రాల్ని ముట్టడిస్తామంటూ మండి పడుతున్నారు.

ఆత్మగౌరవంతో బతికే తమ మీద చేసిన వ్యాఖ్యల్ని తక్షణమే సరిదిద్దకుంటే పోరాటం తప్పదంటూ మండిపడుతున్నారు. తమ పని తాము చేసుకుపోతూ.. ఎవరిని కదిలించుకోకుండా ఉండే వర్గంగా.. సంపద సృష్టించటం.. నలుగురికి సాయంగా ఉంటారన్న పేరున్న కోమట్ల (ఆర్యవైశ్యులు)పై ఆకాశవాణిలో ప్రసారమైన ఒక ప్రకటన తీవ్ర దుమారం రేపుతోంది.

ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా దేశంలోని అన్ని భాషల్లో ప్రచారం చేయాలని కేంద్రం ఆదేశించింది. ఒక భాషలో వెలువడిన ఆ ప్రకటనను ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు తెలుగులోకి తర్జుమా చేశారు. ఇది ఆర్యవైశ్యుల్ని అవమానించేలా ఉందని వారు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఇంతకీ.. ఆ ప్రకటనలో ఉన్నదేమంటే.. నిరుద్యోగి లేని కొడుకుతో తండ్రి మాట్లాడుతూ.. ‘‘నా సంపాదనంతా ఆ కోమటోడికి వడ్డీ కట్టటానికే సరిపోయింది’ అంటూ వ్యాఖ్యానించటంపై ఆర్యవైశ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్యవైశ్య  కులాన్ని దారుణంగా కించపరస్తూ ఆకాశవాణిలో ప్రసారమైన వ్యాఖ్యలకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేయాలని లేదంటూ ఆకాశవాణి కేంద్రాల్ని ముట్టడిస్తామని.. న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తామని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ హెచ్చరిస్తోంది. మరోవైపు.. ఈ ప్రకటనలో దొర్లిన తప్పును ఎత్తి చూపుతూ ఆకాశవాణి కేంద్రం దృష్టికి తీసుకెళ్లటం.. వెంటనే ఆ ప్రకటనను నిలిపివేయటంతో పాటు.. ముంబయిలోని యాడ్ ఏజెన్సీ సంస్థకు ప్రకటనను నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేశారు. జరిగిన పొరపాటుకు చింతిస్తున్నామని ఆలిండియా రేడియో డిప్యూటీ డైరెక్టర్ కృష్ణకుమారి ఈ నెల 26న ఒక ప్రకటన విడుదల చేశారు. ఇలా.. ఇష్టం వచ్చినట్లుగా ప్రకటన తయారు చేసి పొరపాటు జరిగింది.. చింతిస్తున్నామంటే సరిపోతుందా?
Tags:    

Similar News