లోకేశ్ వేసుకునే చెప్పుల ఖరీదు రూ.40వేలా?

Update: 2016-03-04 06:38 GMT
ఉద్యమాలు చేయటం తప్పు కాదు. వెనుకబడిన వారి క్షేమం కోసం పోరాటం చేయటాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ.. ఆ పేరుతో తామేం మాట్లాడుతున్నామో వెనుకాముందు చూసుకోకుండా మాట్లాడితేనే అసలు ఇబ్బంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారు సొంతంగా వ్యాపారం చేసుకోవటానికి రూ.40వేలు ప్రభుత్వం రుణాలు ఇస్తే.. ఇవాల్టి రోజు అది చిన్న మొత్తమా? పెద్ద మొత్తమా?

వ్యాపారం చేసే వారు ఎవరూ పెద్ద పెద్ద మొత్తాలు పెట్టుబడి పెట్టి భారీ వ్యాపారం చేయరు. ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వస్తారు. పెద్ద పెద్ద కంపెనీలు భారీగా షోరూంలు పెట్టినట్లుగా అందరూ వ్యాపారాలు ఆ రేంజ్ లో స్టార్ట్ చేయరు. ఈ విషయం వ్యాపారం మీద అవగాహన ఉన్న ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. కాపుల క్షేమమే తన లక్ష్యంగా.. వారిని బీసీ జాబితాలో చేర్చాలన్న లక్ష్యంతో ఉద్యమం చేస్తున్న కాపుల నేత ముద్రగడ పద్మనాభం తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగానూ.. ఆశ్చర్యకరంగానూ ఉన్నాయి.

ఆర్థికంగా బలహీనంగా ఉన్న కాపులకు.. వ్యాపారాలు చేసేందుకు రూ.40వేలు రుణాలు ఇవ్వటాన్ని ముద్రగడ తాజాగా తప్పు పట్టారు. ఆ మొత్తం చంద్రబాబు కుమారుడు లోకేశ్ చెప్పుల విలువ చేయదని ఆయన ఆక్షేపించారు. చూసేందుకు రూ.40వేలు చిన్న మొత్తంగా అనిపించొచ్చు. కానీ.. ఆ మొత్తంతో వ్యాపారం స్టార్ట్ చేయలేనంత పరిస్థితి ఉండదు. ఇంతా చేస్తే.. వ్యాపారం చేయటానికి ఎంత మొత్తం కావాలన్న ప్రశ్న అడగకుండానే ముద్రగడ ఆ మాటను చెప్పేశారు.

‘‘రూ.40వేలు రుణం ఇస్తే ఏం చేసుకోవాలి. చంద్రబాబు కొడుకు వేసుకునే చెప్పుల విలువ చేయని మొత్తంతో వ్యాపారాలు చేయాలా? కనీసం రూ.10లక్షలు ఇవ్వకపోతే మా దరిద్రపు బతుకుతు తీరుతాయా?’’ అని ప్రశ్నించారు. ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకోవటానికి.. వారు వ్యాపారాలు చేసుకోవటానికి ప్రభుత్వం రూ.10లక్షల చొప్పున సాయం ఇవ్వగలదా?

ఇంత భారీ మొత్తం ఏపీ మాత్రమే కాదు దేశంలోని మరే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. డిమాండ్లు చేసే విషయంలో కాస్త అయినా అర్థం ఉండాలన్న చిన్న విషయాన్ని ముద్రగడ ఎందుకు మిస్ అవుతున్నారు? ఇలాంటి వ్యాఖ్యలు ఉద్యమనేత నోటి నుంచి వస్తే.. ఆయనకు మద్దుతుగా నిలవాలనుకునే మిగిలిన వర్గాలు వెనక్కి తగ్గే ప్రమాదం ఉందన్న విషయాన్ని గుర్తిస్తే మంచిది. అన్నట్లు.. చంద్రబాబు కుమారుడు లోకేశ్ వేసుకునే చెప్పుల విలువ రూ.40వేలు ఉంటాయా..?
Tags:    

Similar News