ముద్రగడ దెబ్బకు టెన్షన్ తో పోలీసుల్లో వణుకు

Update: 2016-06-07 15:12 GMT
తూర్పు గోదావరి పోలీసుల ఉన్నతాధికారులు ఈ మంగళవారాన్ని వారు కొద్దిరోజుల పాటు మర్చిపోయే చాన్స్ లేనట్లే. కాపు ఉద్యమనేత కమ్ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దెబ్బకు వారు విలవిలలాడిపోతున్నారు. ఏం చేయాలో తోచక కిందామీదా పడుతున్న పరిస్థితి. ఏ చిన్న తేడ వచ్చినా కస్సుమనే సర్కారు ఓపక్క.. కాపు ఉద్యమనేతలు మరోపక్క ఉండటంతో వారు ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి. ఇదిలా ఉంటే.. ముద్రగడ పద్మనాభం ఇస్తున్న షాకులతో వారి నోటి వెంట మాట రాక.. ఏం చేయాలో తోచక తడారిపోయిన పరిస్థితి.

మంగళవారం ఉదయం అమలాపురం పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి.. సోమవారం అదుపులోకి తీసుకున్న తుని నిందితుల్ని విడుదల చేయాలని డిమాండ్ చేయటం.. పోలీసుల నుంచి సానుకూల స్పందన రాకపోవటంతో.. ఆగ్రహం చెందిన ఆయన పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేయటం.. తన మీద కేసులు ఉన్న నేపథ్యంలో తనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ముద్రగడ మాటలకు సమాధానం చెప్పలేని వారు.. అనంతరం ఆయన్ను జీపులో తరలించారు.

ఆయన్ను వాహనంలోకి ఎక్కించటంతో రాజమండ్రికి తీసుకెళతారని.. పోలీసులు అదుపులో తీసుకున్నట్లుగా కాసేపు ప్రచారం జరిగింది. అయితే.. తాము రాజమండ్రికి తీసుకెళ్లకుండా ముద్రగడను ఆయన స్వగ్రామమైన కిర్లంపూడికి తీసుకెళ్లారు. దీంతో.. ఈ వ్యవహారం అక్కడితో ముగుస్తుందని అందరూ భావిస్తున్న వేళ.. పోలీసులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా షాకిచ్చారు ముద్రగడ. కిర్లంపూడికి చేరుకున్న తర్వాత వ్యాన్ దిగాల్సి ఉన్నప్పటికి వ్యాన్ దిగకుండా ఆయన మౌనంగా ఉండిపోయారు. సోమవారం అదుపులోకి తీసుకొన్న వారిని విడుదల చేయాలన్న డిమాండ్ ఆయన చేస్తున్నారు. దీంతో.. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో పోలీసులు ఉండిపోయారు. ఇది ఒకట్రెండు గంటలు కాకుండా గంటల కొద్దీ సాగిపోటం.. రాత్రి అయినా ముద్రగడలో ఎలాంటి మార్పు రాకపోవటంతో ఏం చేయాలన్నది ఇప్పుడు పోలీసులకు పెద్ద సమస్యగా మారింది. మరి.. ముద్రగడను ఎలా సముదాయిస్తారో చూడాలి.​
Tags:    

Similar News