కాపులకు రిజర్వేషన్ వస్తేనే ఆయనకు పండుగట

Update: 2017-12-19 17:16 GMT
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చంద్రబాబుపై ఎక్కడలేని నమ్మకం కనబరుస్తున్నారు. కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమించిన ఆయన ఇప్పుడు చంద్రబాబు తాజా తీర్మానాలతో సంయమనం పాటిస్తున్నారు. అయితే... రిజర్వేషన్లు సాధించుకునే వరకు తాను ఎలాంటి పండుగలు చేసుకోనని అంటున్నారు.
    
కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు బీసీ రిజర్వేషన్ ఫలాలు అందే వరకూ ఏ పండగ చేసుకోనని ముద్రగడ మరోసారి ప్రకటించారు. తాజాగా ఆయన విడుదల చేసిన ఓ ప్రకటనలో.... 2018 కొత్త సంవత్సర వేడుకలకూ దూరంగానే ఉంటానని అన్నారు. కాపు - బలిజ - ఒంటరి కులాలకు ఆశించిన మేరకు రిజర్వేషన్లు పొందడమే తన దృష్టిలో అసలైన పండగని ఆయన పేర్కొన్నారు. ఆ అసలైన పండగ కోసం..ఆరోజు కోసమే తాను కూడా నిరీక్షిస్తున్నానని తెలిపారు.
    
ఈ క్రమంలో ఆయన కొత్త సంవత్సరం వేడుకలకు కూడా దూరంగా ఉండబోతున్నట్లు తెలిపారు. జనవరి 1న తనను కలిసేందుకు, శుభాకాంక్షలు చెప్పేందుకు ఎవరూ కిర్లంపూడికి రావొద్దని ఆయన సూచించారు . ఈ మేరకు ఆయన ఒక ప్రకటన కూడా విడుదల చేశారు.
    
కాగా - కాపులకు రిజర్వేషన్లకు ఏపీ అసెంబ్లీ తీర్మానించింది. కానీ... అది కేంద్రం చేయాల్సిన పని. పైగా 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదని.. ఎవరైనా అలాంటి హామీలిస్తే అది అసత్య వాగ్దానమేనని ఇటీవలే ప్రధాని మోదీ అన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు శుష్క యత్నాలు ఎంతవరకు ఫలితమిస్తాయన్నది అనుమానమే. కానీ... రిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్న ముద్రగడ మాత్రం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోరాదన్న ఉద్దేశంతో ఎంతో ఆశతో సంయమనంగా ఉంటున్నారు. చివరకు చంద్రబాబు విషయంలోనూ ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా సానుకూల వాతావరణం మెంటైన్ చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.
Tags:    

Similar News